జిల్లా అభివృద్ధే లక్ష్యం
ఒంగోలు అర్బన్: ఎటువంటి పరిస్థితులు ఉన్నా జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తొలుత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం చైర్మన్ బాలాజీ, అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాల నివారణతో పాటు శిశు మరణాలు తగ్గించనున్నట్లు తెలిపారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లా నుంచి వలసలు తగ్గించడంపై దృష్టి సారించామన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలుస్తుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ విజన్–2047లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించిన పది సూత్రాలను పరిగణలోకి తీసుకుని ఆ కోణంలో జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. మాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, వ్యవసాయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ఓ చిన ఓబులేసు, ఒంగోలు ఆర్‌డీఓ లక్ష్మీప్రసన్న, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ చాటి జిల్లా ఖ్యాతి పెంచిన పలువురిని సత్కరించారు. ముందుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
గంట ఆలస్యంగా దామచర్ల.. ఎదురుచూసిన మంత్రి, కలెక్టర్
జిల్లా అవతరణ దినోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గంటకుపైగా ఆలస్యంగా వచ్చారు. దీంతో ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఇతర ప్రముఖులు ఎదురుచూస్తూ గడిపారు. ప్రతి కార్యక్రమానికి దామచర్ల ఆలస్యంగా వస్తుంటారని, కానీ, మంత్రి, కలెక్టర్ పాల్గొనే కార్యక్రమానికి కూడా ఆలస్యంగా వచ్చి ముఖ్య అతిథులు సైతం వేచి ఉండేలా చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లా ఆవిర్భావ దినోత్సవంలో
మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
కలెక్టర్, అధికారులతో కలిసి ప్రకాశం పంతులు విగ్రహానికి నివాళులు
Comments
Please login to add a commentAdd a comment