![గురుక](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11ong613-260048_mr-1739301407-0.jpg.webp?itok=bwUgwJHc)
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి 5వ తరగతికి ఇంగ్లిషు మాధ్యమం, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఇంగ్లిషు మాధ్యమంలో ప్రవేశానికి బాలురు, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 6వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర పూర్తి వివరాలకు గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ ఉంటుందన్నారు. 5వ తరగతికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
పనిచేయని ఈవీఎంలు బెంగళూరుకు తరలింపు
ఒంగోలు సిటీ: ఒంగోలులోని మామిడిపాలెం గోదాములో ఉన్న గత ఎన్నికల్లో పనిచేయని వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను బెంగళూరులోని బెల్ కంపెనీకి అధికారులు మంగళవారం పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వీవీ ప్యాట్లు 35, బ్యాలెట్ యూనిట్లు 16, కంట్రోల్ యూనిట్లు 10 కలిపి మొత్తం 61 యూనిట్లను బెల్ కంపెనీకి పంపించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ ఎలక్షన్ సెల్ రిప్రజెంటేటివ్ దామరాజు క్రాంతికుమార్, కోనేటి వెంకటరావు, గుర్రం సత్య నారాయణ, దండే శ్రీను, ఓ రసూల్, వెంకటస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మలేరియా ఆఫీసును సందర్శించిన డీడీ
ఒంగోలు సిటీ: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ (మలేరియా) రామనాథరావు జిల్లా మలేరియా ఆఫీసును మంగళవారం సందర్శించి రికార్డ్స్‌ను పరిశీలించారు. అనంతరం టంగుటూరు పీహెచ్‌సీని సందర్శించి, డెంగీ కేసులు వచ్చిన ఏరియాను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలసి ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం గురించి వివరించారు. జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి యన్.మధుసూదనరావుకు సూచించారు. సచివాలయం పరిధిలో ఏఎన్‌ఎంలు వెక్టార్ కంట్రోల్ యాప్ లో దోమల పెరుగుదల ప్రదేశాలను గుర్తించి అప్లోడ్ చేయించాల్సిందిగా సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్రవణ్ కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
![గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11ong612-260048_mr-1739301407-1.jpg)
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment