![మెగా క్యాంపు వ్యాఖ్యలు హుందాగా ఉండాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11ong701_mr-1739301408-0.jpg.webp?itok=xevUQHWb)
మెగా క్యాంపు వ్యాఖ్యలు హుందాగా ఉండాలి
● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు, సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు సినిమా ఫక్షన్‌లలో మాట్లాడే సమయంలో వారి వ్యాఖ్యలు బాధ్యతగా, హుందాతనంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను ఆయన మంగళవారం ఖండించారు. ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్, చరణ్, తాజాగా చిరంజీవి, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాలకు వచ్చిన సమయంలో వారి భాష చాలా జుగుప్సాకరంగా ఉందని అన్నారు. పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా ముఖ్యంగా మా అధినాయకుడిని, ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను కించపరిచేలా వారి మాటలు ఉంటున్నాయన్నారు. వారేకాకుండా పక్కవారు మాట్లాడుతున్నా వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఏర్పడుతోందని, ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైందన్నారు. ఇండస్ట్రీ అనేది అందరి కలయిక అని, కొందరి కోసం పెట్టినది కాదని అన్నారు. ఈ విషయంపై సినిమా ఇండస్ట్రీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని, అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలు ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసమేనని, కేవలం మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల స్వప్రయోజనం కోసమని అన్నారు. వారు కోటి 32 లక్షల మంది ఓట్లు వేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడమనేది మంచి పద్ధతికాదని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్దలు ఇటీవల కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యలు చూస్తే చాలా దిగజారి మాట్లాడుతున్నట్లు ఉందని అన్నారు. కచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉందని, సినిమాలో ఎమోషన్ మీరు చూపించినట్లే పార్టీలో ఉన్న మాలాంటి స్వాభిమానం కలిగిన నాయకులకు ఎమోషన్ ఉంటుందని, మా నాయకుడి కోసం మేము నిలబడతామని అన్నారు. సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్న వారిని ఆ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు గ్రహించాలన్నారు. కొంతమంది కోసమే ఈ ఇండస్ట్రీ అన్నట్లు వారు మాట్లాడుతున్న విధానాన్ని కూడా గమనించాలని కోరారు. ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం.. మీరు సినిమా నుంచి ఎదిగిన తరువాత మెగా ిజీరోలుగా పరిణితి చెందారని, మీరు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలుగా ఉండాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. మీరు ఈ మధ్య చేసిన కార్యక్రమాల ద్వారా దగా హీరోలుగా మారుతున్నారని, ఈ పంథాను మార్చుకోవాలని, మెగా హీరోలు దగా హీరోలుగా మారడమనేది మంచి పద్ధతి కాదన్నారు. ఇండ్రస్ట్రీకి, మీకు, ఈ సమాజానికి మంచిది కాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment