కాంగ్రెస్ హామీలు అమలు చేయాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
సిరిసిల్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్న సాక్షిగా అమలు చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో సోమవారం మాట్లాడుతూ.. జిల్లాలోని మధ్యమానేరు నిర్వాసితులకు ప్రతిపక్ష నేతగా గతంలో ఇచ్చిన హామీలను సీఎం హోదాలో నెరవేర్చాలని, నిర్వాసితులకు రూ.5.04 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. 4696 మందికి మాత్రమే ఇస్తున్నట్లు జీవో జారీచేయడం సరికాదన్నారు. పదివేలకు పైగా ఉన్న నిర్వాసితుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. వేములవాడకు వస్తున్న సందర్భంగా సిరిసిల్ల నేతన్నల ఉపాధికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. వస్త్రపరిశ్రమను ఆదుకోవాలని, నేతన్నలకు పని కల్పించాలన్నారు. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరితో సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు, ఆకలి చావులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సిరిసిల్లకు ప్రత్యేకంగా రూ.50లక్షల నిధిని అందించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు గూడూరి ప్రవీణ్, ‘సెస్’ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, మ్యాన రవి, జిల్లా సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment