సర్కారు భరోసా
గల్ఫ్ గోస..
● వలస బాట.. ఉపాధి వేట ● పది నెలల్లో 17 మంది మృతి
● వలస జీవుల కుటుంబాల్లో తీరని విషాదం
● ఆర్థిక సాయంతో సర్కారు చేయూత
● రేపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రొిసీడింగ్స్
ఈమె పేరు విక్కుర్తి రేణుక. కోనరావుపేట మండలం నిమ్మపల్లి. రేణుక భర్త విక్కుర్తి ఎల్లయ్య(47) ఈ ఏడాది జనవరిలో బతుకుదెరువు కోసం దుబాయ్‌కి జిన్కో కంపెనీ వీసాపై వెళ్లాడు. ఊరిలో పెద్దగా భూమి లేదు. ఇల్లు శిథిలమైంది. దుబాయ్‌లో జీతం సరిగా రాలేదు. ఊరిలో చేసిన రూ.9లక్షల అప్పులున్నాయి. మానసిక వేదనకు గురైన ఎల్లయ్య దుబా య్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిమ్మపల్లిలో నాలుగేళ్ల కొడుకు రెహాన్‌తో రేణుక కన్నీటి పర్యంతమవుతోంది.
చందుర్తి మండలం బండపల్లికి చెందిన పోతుగంటి భూమయ్య(45) కుటుంబం ఇదీ. పదేళ్లుగా భూమయ్య మస్కట్, సౌదీ అరేబియా దేశాలకు ఉపాధి కోసం వెళ్లాడు. గతేడాది సౌదీఅరేబియా వెళ్లాడు. అక్కడ సరైన పని లేక గుండెపోటుతో ఫిబ్రవరి 2న మరణించాడు. భూమయ్యకు తల్లి మల్లవ్వ, భార్య లక్ష్మీ, కూతురు కల్యాణి, కుమారుడు మారుతి ఉన్నారు. కూతురు పెళ్లికి చేసిన అప్పుల భారం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది.
బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన గంగిపల్లి తిరుపతి కుటుంబం. తిరుపతి ఉపాధి కోసం 18ఏళ్లుగా దుబాయ్ వెళ్లివస్తున్నాడు. జూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి మృతిచెందాడు. విషయాన్ని కంపెనీ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆలస్యంగా తెలిసింది. ఆయన మరణంతో కొడుకు నవదీప్, కూతురు అక్షితలను పోషించే భారం భార్య లావణ్యపై పడింది. అప్పటికే ఇల్లు కట్టుకున్న అప్పుల భారం ఆ కుటుంబాన్ని వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment