సర్వే సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
● అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
సిరిసిల్ల: సమగ్ర ఇంటింటీ కుటుంబ(సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ పేర్కొన్నారు. జిల్లాలో పూర్తయిన కుటుంబాల సర్వే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మాస్టర్ ట్రెయినర్లకు కలెక్టరేట్‌లో శనివారం శిక్షణనిచ్చారు. ప్రతీ మండలానికి ఇద్దరు, మున్సిపాలిటీ పరిధిలో నలుగురు చొప్పున మొత్తం 28 మంది మాస్టర్ ట్రెయినర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. మాస్టర్ ట్రైయినర్లు మండల కేంద్రాలు, జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన 480 మంది ఆపరేటర్లకు డాటా ఎంట్రీపై శిక్షణ ఇచ్చారని వివరించారు. శిక్షణ పొందిన ఆపరేటర్లు డాటా ఎంట్రీని జిల్లాలో ప్రారంభించారని ఖీమ్యానాయక్ తెలిపారు. జిల్లాలో శిక్షణ పొందిన 28 మంది మాస్టర్ ట్రైయినర్ల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ సాగుతుందన్నారు. సర్వే సమాచారం ఆన్‌లైన్ చేసే విధానంపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు.
కేసుల దర్యాప్తులో అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
● తంగళ్లపల్లి ఠాణా తనిఖీ
సిరిసిల్లక్రైం: కేసుల దర్యాప్తులో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌మహాజన్ సూచించారు. తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పలు రికార్డులు తనిఖీ చేసి మాట్లాడారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది 100 డయల్ కాల్స్‌కు తక్షణమే స్పందించాలన్నారు. పెట్రోలింగ్ సమయంలో ఠాణా పరిధిలోని రౌడీషీటర్లను నిత్యం తనిఖీ చేయాలన్నారు. సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకే మెసేజ్‌లపై జాగ్రత్త వహించాలన్నారు. పోలీస్ యూనిఫామ్‌తో వీడియోకాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే స్పందించొద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్‌ఫ్రీ నంబర్ 1930కి కాల్‌చేయాలని సూచించారు. సోషల్ మీడియా అకౌంట్స్ కు ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment