ఎల్లంపల్లి కాల్వపనులు పూర్తి చేస్తాం
● గత ప్రభుత్వ అసమర్థతోనే పెండింగ్ ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): ఎల్లంపల్లి ప్రాజెక్టు కాల్వ పనులు పూర్తిచేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని దేవునితండాలో శనివారం ఎల్లంపల్లి కాల్వ పనులకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ప్రొక్లెయిన్ నడిపి పనులు ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అసమర్థతతోనే ఎల్లంపల్లి పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. వైఎస్సార్ బతికి ఉంటే ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు. కోనరావుపేట మండలం లచ్చపేటతండా వరకు కాల్వ పూర్తి చేసి సనుగుల ఎర్ర,పటేల్ చెరువును నింపుతామన్నారు. నియోజకవర్గంలోని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.325కోట్లను బడ్జెట్‌లో కేటాయించారని తెలిపారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ పనుల పూర్తికి రూ.20కోట్ల మంజూరు కోసం నీటిపారుదలశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కలికోట సూరమ్మ చెరువు, సనుగుల పెండింగ్ పనులను ప్రారంభించినట్లు వివరించారు. చందుర్తి తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీలు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, సనుగుల సింగిల్‌విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, ఎల్లంపల్లి ప్రాజెక్టు డీఈ రఫీ, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షులు బొజ్జ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment