‘ప్రాథమిక’ వైద్యం అంతంతే !
● జిల్లా ఆస్పత్రిలోనే డెలివరీలు ● వైద్యసిబ్బందిలో నిర్లక్ష్యం ● నీరుగారుతున్న కలెక్టర్ లక్ష్యం ● ప్రైవేట్‌కు వెళ్తూ దోపిడీకి గురవుతున్న జనం
జిల్లా సమాచారం
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లా ఆస్పత్రుల్లోనే డెలివరీలు చేస్తుండగా పీహెచ్‌సీల్లో ప్రసూతి సేవలు అంతంతగానే అందుతున్నాయి. నిరుపేదలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తూ ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు.
24 గంటల ఆస్పత్రుల్లోనూ అంతే..
జిల్లాలోని 24 గంటల వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ కూడా గర్భిణులకు సరైన వైద్యం అందడం లేదని తెలుస్తోంది. కేవలం వైద్యపరీక్షలు చేయడం వరకే పీహెచ్‌సీలు విజయవంతంగా పనిచేస్తున్నాయి. ఇక అర్బన్ హెల్త్‌సెంటర్లలో కూడా సాధారణ కాన్పులు జరగడం లేదు. గత ఐదు నెలల్లో చందుర్తిలో 4, గంభీరావుపేట సీహెచ్‌సీలో 5, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేటల్లో ఒక్కో నార్మల్ డెలివరీలు జరిగాయి. మిగతా పీహెచ్‌సీలలో అసలు డెలివరీలే కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పేరుకే పీహెచ్‌సీలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఇక వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో 420, జిల్లా ఆస్పత్రిలో 1,302 డెలివరీలు చేశారు. ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది లక్ష్యానికి అనుగుణంగా శ్రమించినట్లు భావించవచ్చు. జిల్లాలో ఎక్స్‌పెక్టేషన్ డెలివరీ డేట్(ఈడీడీ) కేసులు ప్రస్తుతం 4,962 ఉన్నాయి.
సౌకర్యాలు కరువు
పోతుగల్ పీహెచ్‌సీని 1965లో నిర్మించారు. భవనం పాతబడింది. ఇన్‌వార్డు విభాగం దెబ్బతింది. తరచూ మరమ్మతులతో ఆపరేషన్ థియేటర్ సరిగా లేదు. ఇక్కడ ఇద్దరు రెగ్యులర్ వైద్యాధికారులు పనిచేయాల్సి ఉండగా, కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ విధుల్లో ఉన్నారు. 24 గంటల ఆస్పత్రి అయినా రాత్రి వేళల్లో ఏఎన్‌ఎం మాత్రమే విధుల్లో ఉంటారు. సిబ్బంది లేక సాధారణ ప్రసవాలు చేయడం లేదు. కొత్తగా నిర్మించిన పీహెచ్‌సీ భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేటకు సీహెచ్‌సీ మంజూరు చేయగా, భవనం నిర్మించలేదు. పీహెచ్‌సీలోనే సీహెచ్‌సీ నిర్వహిస్తున్నారు.
ప్రైవేటుకు పరుగులు
ఒక్కో డెలివరీకి రూ.30వేల నుంచి రూ.లక్ష బిల్లు వేసే ప్రైవేటు ఆస్పత్రులు జిల్లాలో ఉన్నాయి. గత ఐదు నెలల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,308 డెలివరీలు అయ్యాయి. ఒక్కో డెలివరీకి రూ.50వేలు బిల్లు వేసినా మొత్తం రూ.6.54కోట్లు ప్రజల నుంచి ప్రైవేటు యజమాన్యాలకు వెళ్లాయి. చాలా మంది గర్భిణులు పీహెచ్‌సీల్లో వైద్యం చేయించుకుంటుండగా.. డెలివరీ సమయానికి ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. కాగా కొంత మంది ప్రైవేట్ వైద్యులు అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా ప్రజలు ప్రైవేటుకే మొగ్గు చూపుతున్నారు. పీహెచ్‌సీలను ఆధునీకరించి, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, డీజీవో వైద్యులు, సర్జన్లు, ఇతర సిబ్బందిని నియమిస్తే జిల్లా ఆస్పత్రి లాగే సేవలందిస్తాయనే భావన ఉంది.
పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు చేయాలి
పేద, మధ్య తరగతి ప్రజలు ప్రసవాలకు అప్పు చేసి లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నారు. గర్భిణులకు నెలనెలా వైద్యం అందించే పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు చేయాలి. అవసరమైతే ఆపరేషన్లు చేసి ఆదుకోవాలి.
– మెరుగు అంజాగౌడ్, ముస్తాబాద్
నార్మల్ డెలివరీలు చేయాలని చెప్పాం
పీహెచ్‌సీల్లో నార్మల్ డెలివరీలు చేసేలా వైద్యులు, సిబ్బందికి చెబుతున్నాం. చాలా వరకు జిల్లా ఆస్పత్రికి పంపిస్తున్నారు. పీహెచ్‌సీల్లోనే డెలివరీలు అయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తాం. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ వసంతరావు, జిల్లా వైద్యాధికారి
జిల్లా ఆస్పత్రి 01
ప్రాంతీయ వైద్యశాల 01
కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు 02
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 13
అర్బన్ హెల్త్ సెంటర్లు 02
Comments
Please login to add a commentAdd a comment