పరిష్కారం లభించేనా?! | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం లభించేనా?!

Published Mon, Nov 25 2024 7:07 AM | Last Updated on Mon, Nov 25 2024 7:07 AM

పరిష్కారం లభించేనా?!

పరిష్కారం లభించేనా?!

అధికారుల

సమస‍్యలకు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: సింగరేణి అధికారుల సుధీర్ఘ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐదేళ్ల పాటు అధికారుల స్ట్రక్చర్‌ సమావేశాలు లేక సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో చాలా మంది అధికారులు నిరాశ నిస్పృహలతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అంతర్గత పదోన్నతులకు నిబంధనలు అడ్డంకి కావడంతో ఈసమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఈక్రమంలో ఈనెల 25న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో అధికారుల సమస్యలపై స్ట్రక్చర్‌ సమావేశం నిర్వహిస్తోంది. దీనిపై కథనం..

ఏళ్లుగా పెండింగ్‌లో సమస్యలు

సింగరేణి అధికారులు తమ సమస్యల పరిష్కారం కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఎంఓఏఐ)కు అనుబంధంగా సింగరేణి అధికారుల సంఘం కొనసాగుతోంది. ఈక్రమంలో కొన్నేళ్లుగా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఉన్న అధికారుల సంఘం నాయకులు తమ సమస్యలపై సరిగా స్పందించలేదని అసంతృప్తి మొదలైంది. ఈక్రమంలో నిర్వహించిన అధికారుల సంఘం ఎన్నికల్లో కొత్త నాయకత్వం బాధ్యత స్వీకరించింది. సీఎంఓఏఐ అధ్యక్షుడిగా లక్ష్మీపతిగౌడ్‌ ఎంపికయ్యారు. వీరితో పాటు పూర్తి స్థాయి కమిటీ తమ బాధ్యతలను స్వీకరించింది. అధికారుల సమస్యలను సీఎంఓఏఐ నాయకత్వం పలుదఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకవస్తూనే ఉంది. ఇటీవల రామగుండం పర్యటనకు వచ్చిన సింగరేణి డైరెక్టర్‌(పా) వెంకటేశ్వర్‌రెడ్డితో అధికారుల సంఘం నాయకులు భేటీ అయ్యారు. గోదావరిఖని ఇల్లెందు క్లబ్‌లో డైరెక్టర్‌తో సమావేశమై సమస్యల పరిష్కారం కోసం స్ట్రక్చర్‌ సమావేశానికి గ్రీన్‌సిగ్నల్‌ తీసుకున్నారు. ఈక్రమంలో సోమవారం అధికారుల సంఘం నాయకులతో యాజమాన్యం భేటీ కానుంది.

అంతర్గత పదోన్నతులే ప్రధాన ఎజెండా

సంస్థ వ్యాప్తంగా సింగరేణి అధికారులకు అంతర్గత పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోంది. ఎక్స్‌టర్నల్‌ అధికారులకు పదోన్నతి కల్పిస్తున్నప్పటికీ అంతర్గతంగా పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతోంది. ఈవిషయంలో ఏడేళ్లుగా అధికారులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. అంతేకాకుండా ఫస్ట్‌క్లాస్‌ పాసైన అభ్యర్థుల విషయంలో కూడా అన్యాయం జరుగుతోంది.

నేడు స్ట్రక్చర్‌ సమావేశం

సింగరేణి అధికారుల నాయకత్వంతో యాజమాన్యం కొత్తగూడెంలో సోమవారం భేటీ కానుంది. ఈ సందర్భంగా అధికారుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు సంఘం నాయకులు సిద్ధమవుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత సమావేశం నిర్వహిస్తుండటంతో సమస్యల పరిష్కారానికి మోక్షం లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

● న్యాయబద్ధమైన పదోన్నతి పాలసీ అమలు చేయాలి.

● ఫీల్డ్‌లో పనిచేస్తున్న అధికారులకు సౌకర్యాలు ఆధునీకరించాలి.

● పారదర్శక బదిలీ పాలసీ అమలు చేయాలి.

● ఆసుపత్రి సౌకర్యాలు ఆధునీకరించాలి. రిటైర్డ్‌ అధికారులకు మెడికల్‌ కార్డు అందించాలి.

● ఓసీపీలో అధికారులకు ఏసీ వాహనాలు కేటాయించాలి.

● కోలిండియాలోని పదోన్నతి పాలసీ అమలు చేయాలి.

● ఫస్ట్‌క్లాస్‌ మేనేజర్ల విషయంలో ఇటీవల వచ్చిన సర్క్యులర్‌లో మార్పులు చేయాలి.

● సీడీఏ రూల్స్‌లో నిబంధనలు సడలించాలి.

● ఎంకై ్వరీ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్‌ ఆపవద్దు.

● కోలిండియా ప్రకారం డిజిగ్నేషన్స్‌ కేటాయించాలి.

● అధికారులకు ఉచిత విద్యుత్‌, ఐఐటీ ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి.

ఐదేళ్ల తర్వాత ఇదే మొదటి అధికారిక సమావేశం

సంస్థ వ్యాప్తంగా 2,300 మంది అధికారుల ఎదురుచూపు

నేడు కొత్తగూడెంలో అధికారులతో యాజమాన్యం భేటీ

సమస్యలపై దృష్టిసారించాం

సింగరేణి అధికారుల సమస్యలపై చర్చించేందుకు స్ట్రక్చర్‌ సమావేశానికి అంగీకరించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా జరిగే ఈ సమావేశంలో పదోన్నతులపై ప్రధానంగా దృష్టి సారించాం. అంతర్గత పదోన్నతుల విషయంలో అన్యాయం జరిగింది. చాలా మంది అధికారులు ఈవిషయంలో అసంతృప్తిగా ఉన్నారు. దీన్నే ప్రధాన ఎజెండాగా పెట్టాం. తాము గెలిచిన తర్వాత మొదటిసారిగా జరిగే స్ట్రక్చర్‌ సమావేశంలో అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమస్యల పరిష్కారంలో రాజీలేకుండా ముందుకు సాగుతాం.

– లక్ష్మీపతిగౌడ్‌,

అధికారుల సంఘం అధ్యక్షుడు, సింగరేణి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement