హార్ట్ అటాక్
● జిల్లాలో నెలరోజుల్లో 30 మంది మృతి ● రోడ్డున పడుతున్న కుటుంబాలు ● ఆహార అలవాట్లతోనే ముప్పు అంటున్న వైద్యులు
ఇతను ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన రైతు కుషంగి దేవేందర్‌రెడ్డి. 20 రోజుల క్రితం పొలం పనులు చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలోనే కుప్పకూలాడు. సమీప పొలాల్లోని రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, అతడి కొడుకు వచ్చి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించాడు. అయినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. నిత్యం పొలంలో శ్రమించే రైతు గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది.
● చలికాలం సైలెంట్ మరణాలు ● నిద్రలోనే పోతున్న ప్రాణాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చలికాలం ప్రాణసంకటంగా మారుతోంది. గుండెపోటుతో ప్రాణాలు పోతున్నాయి. షుగర్, బీపీ పేషెంట్లకు ఈ శీతాకాలం మరింత ముప్పుగా మారుతోంది. సైలెంట్ హార్ట్‌స్ట్రోక్స్ నిద్రలోనే ప్రాణాలు తీస్తున్నాయి. రెండు నెలల్లో జిల్లాలో సైలెంట్ హార్ట్‌స్ట్రోక్స్‌తో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సగానికి పైగా యువకులే ఉండడంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
ప్రాణసంకటంగా ఆహారపు అలవాట్లు
ఇటీవల ప్రజల్లో వచ్చిన ఆహారపు అలవాట్లే ప్రాణసంకటంగా మారుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. జంకుఫుడ్, అధిక నూనె ఉన్న ఆహారపదార్థాలు తినడంతోనే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంది. అంతేకాకుండా ఆహారంలో మాంసం, చికెన్ ఎక్కువగా తీసుకోవడం ఊబకా యానికి దారితీస్తోంది. ఊబకాయం అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్రధానంగా కాలేజీ విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి తెచ్చుకోకుండా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలో ఫ్రైడ్‌రైస్, నూడుల్స్, పిజ్జాలు, బర్గర్‌లు వంటి జంకుఫుడ్ తింటూ చిన్నప్రాయంలోనే గుండెపోటుకు గురవుతున్నారని వైద్యనిపుణులు విశ్లేషిస్తున్నారు. షుగర్, బీపీ ఉన్నవారు ఆరు నెలలకోసారి ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
తగ్గుతున్న శారీరక శ్రమ
ఇటీవల వస్తున్న మార్పులతో ప్రజల్లో శారీరక శ్రమ తగ్గిపోతుంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోవడం, ఇంట్లో చిన్నచిన్న పనులకు సైతం మెషినరీలు రావడంతో శ్రమ ఏమాత్రం లేకుండా పోయింది. ఉదాహరణకు బట్టలు ఉతికేందుకు వాషింగ్‌మెషిన్లు, ఇల్లు ఊడ్చేందుకు వాక్యూమ్ క్లీనర్లు రావడంతో మహిళల్లో, ప్రతీ పనికి బైక్ వినియోగంతో పురుషుల్లో శారీరక శ్రమ లేకుండా పోతుంది.
అలవాట్లు మార్చుకోవాలి
ప్రజలు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు అందరూ రెడీమేడ్ ఫుడ్ అయినా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో తింటున్నారు. అక్కడ వాడుతున్న నూనె కల్తీ కావడంతోపాటు నాణ్యత లేకపోవడంతో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి పోతుంది. రోజూ కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరం. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారైనా ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
– వంశీకృష్ణ, జనరల్ ఫిజీషియన్
Comments
Please login to add a commentAdd a comment