సర్వేగండం దాటేనా?!
● ఈసారైనా రోడ్డు విస్తరణ జరిగేనా? ● ఇప్పటికే నాలుగుసార్ల సర్వేలు ● తాజాగా నాలుగు బృందాలతో వివరాల సేకరణ
వేములవాడ: ఆధ్యాత్మిక కేంద్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో రోడ్డు విస్తరణ అంశం ఏళ్లుగా నానుతూనే ఉంది. ప్రతీసారి సర్వే చేస్తున్న అధికారులు నివేదికతోనే సరిపెడుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు సర్వే చేయగా.. తాజాగా మరో సారి నాలుగుశాఖల అధికారులు రోడ్డు విస్తరణ కోసం సర్వే చేస్తున్నారు. మూలవాగు వంతెన నుంచి రాజన్న గుడి వరకు 80 ఫీట్లతో విస్తరణ చేపట్టేందుకు సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ చొరవతో జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా రోడ్డు విస్తరణపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశా రు. రోడ్డు విస్తరణకు ప్రభుత్వం రూ.47కోట్లు ప్రకటించడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతుంది.
నాలుగుసార్లు సర్వేలు
వేములవాడ ప్రధాన రహదారి విస్తరణకు అధికారులు నాలుగుసార్లు సర్వే చేశారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ప్రభుత్వ విప్ పదవి దక్కడంతో రోడ్డు విస్తరణ ప్రక్రియ ముందుకు సాగుతోందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. ఐదోసారి జరిగే సర్వేతోనైనా రోడ్డు విస్తరణ పనులు మొదలవుతాయా.. లేదా.. అనే చర్చ సాగుతోంది.
నాలుగు బృందాలతో తనిఖీలు
పట్టణంలో రోడ్ల విస్తరణలో ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాలు, నివాసాలు ఎన్ని పోతున్నాయని అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా ఆర్డీవో నేతృత్వంలో నాలుగు బృందాలను నియమించారు. ఈ బృందాలు సర్వే జరిగిన ప్రాంతాలను తిరిగి తనిఖీ చేయనున్నారు.
నాలుగుశాఖల ఆధ్వర్యంలో సర్వే
రోడ్ల విస్తరణపై ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. ప్రస్తుతం ఆర్డీవో నేతృత్వంలో రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తిచేసిన తర్వాత మున్సిపల్‌కు అప్పగిస్తే పనులు చేపట్టే అవకాశాలు ఉంటాయి.
– అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
Comments
Please login to add a commentAdd a comment