రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దాం

Published Sun, Jan 12 2025 1:30 AM | Last Updated on Sun, Jan 12 2025 1:30 AM

రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దాం

రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దాం

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ● జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరుకు కృషి ● ప్రసాద్‌ పథకంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి నిధులు ● సిరిసిల్లలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ

సిరిసిల్ల: ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాజకీయాలకతీతంగా కలిసి పనిచేద్దామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం చేపట్టిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. రూ.69.54లక్షల విలువైన 674 పరికరాలను 322 మంది దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. వేములవాడలో గతంలో రూ.2.50కోట్లతో 1,930 మంది దివ్యాంగులకు పరికరాలు అందించినట్లు గుర్తుచేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఆ తర్వాత అందరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరుకు కేంద్ర మంత్రిని కలిసి విన్నవించినట్లు తెలిపారు. ప్రసాద్‌ స్కీంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి కల్పనకు పెట్రోల్‌బంక్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇంకా దివ్యాంగులు మిగిలి ఉంటే మరోసారి క్యాంప్‌ పెట్టి అందజేస్తామని హామీ ఇచ్చారు.

వేములవాడ ప్రాంత అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు : ఆది శ్రీనివాస్‌

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో 9వేల మందికిపైగా దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఈ ఏడాదిలో రూ.75కోట్లు, పట్టణంలో రోడ్డు విస్తరణకు రూ.47 కోట్లు మంజూరైనట్లు వివరించారు. వేములవాడ ప్రాంతంలోని పాఠశాలలను సీఎస్‌ఆర్‌ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌లు శాలువాతో సన్మానించారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాము, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, సిరిసిల్ల, వేములవాడ ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూప, రొండి రాజు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రావు, బండ మల్లేశంయాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు చొప్పదండి ప్రకాశ్‌, ఫిరోజ్‌పాషా, గడ్డం నర్సయ్య పాల్గొన్నారు.

పెద్దాలింగాపూర్‌లో పీహెచ్‌సీ ప్రారంభం

ఇల్లంతకుంట(సిరిసిల్ల): మండలంలోని పెద్దలింగాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర సహాయశాఖమంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రారంభించారు. ఆస్పత్రిని ఎఫ్‌ఎఫ్‌సీ నిధులు రూ.1.56కోట్లతో నిర్మించారు. జిల్లా వైద్యాధికారి రజిత, డాక్టర్‌ శరణ్య, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఐరెడ్డి చైతన్య, నాయకులు పసుల వెంకటి, పాశం రాజేందర్‌రెడ్డి, స్వప్న, వెంకటరమణారెడ్డి, అంతగిరి వినయ్‌కుమార్‌, అమ్ముల అశోక్‌ పాల్గొన్నారు.

సమస్యలపై వినతులు

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ కెనాల్‌ ద్వారా నీటిని ఇల్లంతకుంట మండలం పెద్దలింగా పూర్‌లోని బోయదామకుంటలోకి మళ్లించాలని గ్రా మస్తులు విన్నవించారు. పెద్దలింగాపూర్‌లో బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని, గ్రామం నుంచి బాలుమణిపల్లి రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు.

ఎస్‌ఎస్‌ఏ ఆర్డర్లు ఇప్పించాలి

సిరిసిల్లటౌన్‌: సర్వ శిక్షా అభియాన్‌కు సంబంధించి వస్త్రోత్పత్తి ఆర్డర్లు స్థానిక పవర్‌లూమ్‌ కుటీర పరిశ్రమల యజమానులకు అందించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కోరారు. పట్టణంలో 80 శాతానికి పైగా ఉన్నటువంటి చిన్న పవర్‌లూమ్‌ యజమానులకు గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం లబ్ధి చేకూర్చలేదన్నారు. కుటీర పవర్‌లూమ్‌ వస్త్రోత్పత్తిదారుల సంక్షేమ సంఘం కన్వీనర్‌ గౌడ వాసు, కోకన్వీనర్‌ కొండ ప్రతాప్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement