ఆఖరు అంకానికి పురపాలన
● ఈనెల 26తో ముగియనున్న మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం ● ప్రత్యేకాధికారుల నియామకానికి ప్రభుత్వ ఏర్పాట్లు ● మళ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు కౌన్సిలర్ల సన్నద్ధం ● జిల్లాలో మారిన రాజకీయ సమీకరణలు
సిరిసిల్ల: మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఆఖరు అంకానికి చేరింది. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పాలకవర్గాలు 2020 జనవరి 27న కొలువుదీరాయి. ఈనెల 26వ తేదీ నాటికి పదవీకాలం ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు ప్రత్యేకాధికారులను నియమించి పాలన సాగించాలని భావిస్తోంది. ఈమేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మరోవైపు 2020 నాటి మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానంల్లో అప్పటి టీఆర్‌ఎస్, ఇప్పటి బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోనూ బీఆర్‌ఎస్ ఆధిక్యం చాటుకుంది. పురపాలక సంఘాల ఐదేళ్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై కథనం.
మళ్లీ పోటీకి కౌన్సిలర్లు సిద్ధం
సిరిసిల్ల పట్టణంలో 39 వార్డులు, వేములవాడలో 28 వార్డులు ఉన్నాయి. రెండు పట్టణాల్లోనూ కౌన్సి లర్లుగా ఐదేళ్లుగా పనిచేస్తున్న అభ్యర్థులు మళ్లీ పోటీ కి సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన మరోసారి పోటీలో నిలిచి సత్తాచాటుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో అనుచరులతో సన్నాహాలు చేస్తున్నారు. 2020 ఎన్నికల్లో సిరి సిల్లలో 22 స్థానాలు, వేములవాడలో 16 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించింది. కానీ తాజా రాజకీయ పరిణామాలతో కొందరు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మారిన రాజకీయ సమీకరణలతో మున్సిపల్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వం ప్రకటించకపోగా.. ప్రత్యేకాధికారులను నియమించాలని భావిస్తోంది.
2020 నాటి మున్సిపల్ ఎన్నికల పరిస్థితి
సిరిసిల్ల మున్సిపల్‌లో నలుగురు అభ్యర్థులు కల్లూరి రాజు, అన్నారం శ్రీనివాస్, దార్ల కీర్తన, దార్నం అరుణ ఏకగ్రీవం కాగా.. వేములవాడలో నీలం కల్యాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల లో 35 వార్డుల్లో, వేములవాడలో 27 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికార బీఆర్‌ఎస్ టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు ఇండిపెండెంట్లుగా పోటీచేసి సత్తాచాటుకున్నారు. సిరిసిల్లలో 12 మంది స్వతంత్రులు విజయం సాధించగా.. ఇందులో 9 మంది బీఆర్‌ఎస్ రెబల్స్ కావడం విశేషం. వేములవాడలో ఐదుగురు ఇండిపెండెంట్స్ గెలువగా.. ఇందులో నలుగురు అభ్యర్థులు బీఆర్‌ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు కావడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. సిరిసిల్ల, వేములవాడల్లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థులు మున్సిపల్ చైర్‌పర్సన్లుగా, వైస్‌చైర్మన్లుగా కొలువుదీరారు.
విలీనబంధంపై వీడని చిక్కుముడి
సిరిసిల్లలో విలీనమైన ఏడు గ్రామాలను విడదీసి మళ్లీ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. వేములవాడలోనూ ఐదు గ్రామాలు విలీనమయ్యాయి. వీటిని మళ్లీ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో ఆయా గ్రామాల వివరాలు సేకరించిన ప్రభుత్వం పంచాయతీల ఏర్పాటుపై నిర్ణయాన్ని ప్రకటించలేదు. మున్సిపల్ ఎన్నికల కంటే ముందే.. గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో విలీన బంధంపై ఏదో ఒక్క నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. మరోవైపు 2020 నుంచి 2025 వరకు ఐదేళ్ల పదవీకాలంలో కరోనా లాక్‌డౌన్ వంటి పరిస్థితులు, 2023 శాసనసభ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఆశించిన మేరకు అభివృద్ధి పనులు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో మరో పక్షం రోజుల్లో పుర‘పాలన’ ముగియనుంది. ప్రత్యేకాధికారుల పాలన రానుంది.
Comments
Please login to add a commentAdd a comment