ఆటల్లోనూ రాణించాలి
సిరిసిల్లటౌన్: స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతోత్సవాలను పురస్కరించుకొని ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం క్రీడోత్సవాలను డీఎస్పీ చంద్రశేఖర్ ప్రారంభించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఫిజికల్ గేమ్స్‌లో రాణించాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్, కన్వీనర్ లోపల్లి రాజురావు, విభాగ్ లా ఫోరం కన్వీనర్ సామానపల్లి ప్రశాంత్, టౌన్ సెక్రటరీ ఎనగందుల శ్రీనివాస్, ధనుష్, రాహుల్, రుషి, తిరుపతి, కిషోర్ పాల్గొన్నారు.
భద్రతా ప్రమాణాలు పాటించాలి
సిరిసిల్ల: జిల్లాలోనే బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎం సెంటర్ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాట్లు చేయాలని ఏఎస్పీ డి.చంద్రయ్య కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం బ్యాంకు మేనేజర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు బ్రాంచ్, ఏటీఎం కేంద్రాలు నిర్దేశిత భద్రతా ప్రమాణాల పాటించాలన్నారు. బ్యాంకుల్లోకి ప్రమాదకరమైన వస్తువులు, ఆయుధాలు అనుమతించడానికి వీలులేదన్నారు. హెల్మెట్, మాస్క్ వంటివి బ్యాంకుల్లో నిషేధించాలని సూచించారు. బ్యాంకు వద్ద ఏదైనా సమస్య వస్తే అలారం సిస్టం నుంచి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ.15.65 కోట్లు మంజూరు
వేములవాడ: వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క చొరవతో రూ.15.65 కోట్ల నిధులు మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. వేములవాడ పట్టణ పరిధిలోని లక్ష్మిపూర్– అయ్యోరుపల్లి రోడ్డుకు రూ.1 కోటి, వేములవాడ రూరల్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చెక్కపల్లి రోడ్డుకు రూ.40 లక్షలు, నమలిగుండుపల్లి నుంచి వడ్డెరకాలనీ వరకు రూ.80 లక్షలు, మామిడిపల్లి రోడ్డు నుంచి బొల్లారం వాటర్ ట్యాంక్ వరకు రూ.1.50 కోట్లు, వేములవాడ అర్బన్ మండలం వేములవాడ రోడ్డు నుంచి చంద్రగిరి వరకు రూ.1.20 కోట్లు, కోనరావుపేట మండలంలో వేములవాడ కమాన్ నుంచి పల్లిముక్త, నాగా రం మీదుగా మర్తన్నపేట వరకు రూ.1.50 కోట్లు, చందుర్తి మండలం మర్రిగడ్డ నుంచి ఎన్గల్ రోడ్డు మరమ్మతుకు రూ. 1.50 కోట్లు, మూడపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి నర్సింగాపూర్ (ఎస్సీ కాలనీ) వరకు రూ.1.20 కోట్లు, మేడిపల్లి మండలం కొండాపూర్– ఓడ్యాడు మధ్య రోడ్డు బ్రిడ్జికి రూ.7 కోట్లు మంజూరయ్యాయి.
ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు
సిరిసిల్లటౌన్: చేనేత, జౌళిశాఖ అధికారుల చర్యలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ఉన్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి ఆరోపించారు. మంగళవారం సీపీఐ ఆఫీసులో మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల సంక్షోభంతో కార్మికులు, ఆసాములు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు 14 మాసాలుగా అనేక ఆందోళనలు పోరాటాలు చేస్తున్న క్రమంలో సీఎం ప్రభుత్వ ఆర్డర్లను ఇచ్చారని కొనియాడారు. కాగా 15 రోజుల క్రితం టెస్కో అధికారులు సమావేశం ఏర్పాటు చేసి గతంలో మాదిరిగా కార్మికులు, ఆసాముల వేతనాలు ప్రకటించకుండానే ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని విమర్శించారు. గతంలో మీటరుకు రూ.37 ఇవ్వగా, ప్రస్తుతం రూ.29.50 ఇస్తాననడం సరికాదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తీరు మార్చుకొని గతంలో కంటే మెరుగైన వేతనాలు వచ్చేలా ప్రకటన చేయాలన్నారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీనియర్ నాయకులు నల్ల చంద్రమౌళి, వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment