268 మంది శతాధిక వృద్ధులు! | Sakshi
Sakshi News home page

268 మంది శతాధిక వృద్ధులు!

Published Wed, May 8 2024 9:30 AM

268 మంది శతాధిక వృద్ధులు!

లోక్‌సభ స్థానంలో యువ ఓటర్లే కాదు.. శతాధిక వృద్ధులు కూడా ఉన్నారు. మహేశ్వరంలో 95 మంది, రాజేంద్రనగర్‌లో 65 మంది, శేరిలింగంపల్లిలో 8 మంది, చేవెళ్లలో 93 మంది, వికారాబాద్‌లో ఐదుగురు, తాండూరులో ముగ్గురు ఉన్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో వెల్లడైంది. వీరిలో మెజార్టీ ఓటర్లకు పుట్టిన రోజు ధ్రువపత్రాలు లేకపోవడం, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదో ఒక సంవత్సరం, తేదీ పేర్లు చెప్పడం, ఎన్నికల అధికారులు కూడా ఇవేవీ పట్టించుకోకుండా గుడ్డిగా వారి పేర్లతో పాటు వయసు నమోదు చేశారు. నిజానికి వీరి వయసు వందేళ్ల లోపే ఉండగా, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా అధిక వయసు నమోదైనట్లు సమాచారం. ఇక 90 నుంచి 99 ఏళ్ల వయసు వారు 4,759 మంది ఉండటం విశేషం.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కాబోతున్నారు. వారు ఎటువైపు మొగ్గు చూపితే.. ఆ పార్టీ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు సైతం యువతే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మెజార్టీ ఓట్లు సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కొనసాగుతుండగా, వీటిలో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 15,04,260 మంది పురుషులు ఉండగా, 14,33,830 మంది మహిళలు, 280 మంది ఇతరులు ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్లలోపు వారు 15,20,890 మంది (52శాతం) ఉండటం విశేషం. ఓటు హక్కు వినియోగించుకునే అంశంపై ఇప్పటికే వీరంతా ఓ స్పష్టతకు రావడంతో పాటు కుటుంబ సభ్యులు, నివాస ప్రాంతాన్ని, సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఈ యువత నే ప్రధానంగా దృష్టిలో పె ట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మెగా డీఎస్సీ వేయనున్నట్లు ప్రచారం చేస్తుండగా, బీజేపీ అభ్యర్థి మోదీ సాధించిన విజయాలు, స్వయం ఉపాధి, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ఎజెండాగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సాగునీరు, ఉచిత కరెంట్‌, రియల్‌ ఎస్టేట్‌, ప్రభుత్వ ఉద్యోగాలు వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు.

బరిలో 43 మంది.. ప్రచారంలో ముగ్గురే

బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు మినహా క్షేత్రస్థాయి ప్రచారంలో ఇతరులు పెద్దగా కన్పించడం లేదు. క్షేత్రస్థాయిలోనే కాదు కనీసం సోషల్‌ మీడియాలోనూ వీరి ప్రచారం కన్పించక పోవడాన్ని పరిశీలిస్తే వీరంతా పేరుకే పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోటీ చేస్తున్న వారిలో మెజార్టీ అభ్యర్థులు 40 ఏళ్లలోపు వారే. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీఏ, బీటెక్‌ వంటి ఉన్నత కోర్సులు పూర్తి చేసిన వారే ఉండటం గమనార్హం.

వయసు వారీగా ఓటర్లు

Advertisement
Advertisement