● గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పనులు చకచకా..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఔటర్ రింగ్‌రోడ్డు రావిర్యాల జంక్షన్ నుంచి ప్రతిపాదిత రింగ్‌రోడ్డు వరకు గ్రీన్‌ఫీల్డ్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పనులను కూడా పూర్తి చేసింది. అలాగే, రోడ్డు నిర్మాణంలో భూమిని కోల్పోయే వారి జాబితాను కూడా రూపొందించింది. ఒకవైపు భూ సేకరణ ప్రక్రియను చకచకా పూర్తి చేస్తూనే.. మరోవైపు టెండర్ల ఖరారు ప్రక్రియను కూడా చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ రోడ్డు నిర్మాణ పనులను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్రతిష్టాత్మంగా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారితోనే దానికి మహర్దశ పడుతుందని భావిస్తున్నారు.
రోడ్డు మార్గమిలా..
● ఔటర్‌రింగ్ రోడ్డు రావిర్యాల నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వరకు అంటే.. ఆమనగల్లు వరకు 41.50 కి.మీ మేర గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రాథమిక పనులు చేపట్టింది.
● రెండు దశల్లో దీన్ని నిర్మించనున్నారు. మొదట రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 18 కి.మీ, తర్వాత మీర్‌ఖాన్‌పేట్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆమనగల్లు వరకు 23.50 కి.మీ మార్గాన్ని రెండో దశలో చేపట్టనున్నారు.
● 100 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. దీనికి రెండు వైపులా 3 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్‌లు, 2 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉంటాయి. మొదటి దశ ప్రాజెక్టు కోసం రూ.1,665 కోట్లు, రెండో దశ ప్రాజెక్టు కోసం రూ.2,365 కోట్ల చొప్పున ఖర్చుకానున్నట్లు అంచనా. ఈ నెలలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించి రానున్న మార్చి నాటికి పనులు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment