శత చండీ యాగానికి ముమ్మరంగా ఏర్పాట్లు
కందుకూరు: మండలంలోని దాసర్లపల్లి సమీపంలో ఉన్న శ్రీమాత క్షేత్రంలో ఈ నెల 26 నుంచి 28 వరకు 108 యజ్ఞ గుండాలతో శ్రీరుద్ర సహిత శత చండీ యాగం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం యాగం నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని శ్రీమాత వేద విజ్ఞాన్ ప్రచార పరిషత్ నిర్వాహకుడు రేవెళ్ల రాజు శర్మ కోరారు.
నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక
మహేశ్వరం: మండల పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రానున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమనగంటి ప్రశాంత్‌రెడ్డి, నేనావత్ రాజు నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహేశ్వరం మండల కేంద్రానికి మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి రానున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
కందుకూరు మండలంలో..
కందుకూరు: మండల పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రానున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కందుకూరు చౌరస్తాలో మధ్యాహ్నం 1.30 గంటలకు భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
చిలుకూరులో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్
మొయినాబాద్: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, పూలమాలలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో వీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.నర్సింహాచారి, జిల్లా అధ్యక్షుడు సురేష్, సభ్యులు రమేష్, జ్ఞానేశ్వర్, విజయ్‌కుమార్, నర్సింహాచారి, శేఖర్, రాధా, వడ్డె రమేష్, కృష్ణగౌడ్, దశరథ్, పరమేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
దివ్యాంగుల కమిటీ ఎన్నికకు దరఖాస్తు చేసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగుల శాఖలో పని చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి కేటగిరీ కింద (ఐదుగురు సభ్యులు దివ్యాంగుల స్వచ్చంధ సంస్థల నుంచి) దివ్యాంగుల సమస్యలు, సేవల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అందులో ఒకరు మహిళ అయి ఉండాలని, ఒకరు షెడ్యూల్ కులం వర్గానికి చెందిన అభ్యర్థి లేక షెడ్యూల్డ్ తెగలు వర్గానికి చెందిన వారు అయి ఉండాలన్నారు. రెండవ కేటగిరీ కింద(ఐదుగురు సభ్యులు దివ్యాంగుల్లో పరిజ్ఞానం, అనుభవం కలిగిన వారి నుంచి) దివ్యాంగుల సమస్యలపై అవగాహన కలిగి సేవా దృక్పథం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీరిలో మహిళ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చేందిన అభ్యర్థి అయి ఉండాలన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం లోపు అన్ని ధ్రువీకరణ పత్రాతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment