ఓటు విలువ తెలుసుకో..
షాద్‌నగర్: ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిది. ఓటు హక్కును పొందడం.. వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత.. ఐదేళ్లకు ఓసారి పాలకులను ప్రజలే స్వయంగా ఓటు వేసి ఎన్నుకుంటారు. ఓటర్లు తమ ఓటు హక్కుతో నచ్చిన వారికి అధికారం కట్టబెడతారు.. లేదంటే పదవి నుంచి దింపేస్తారు.. ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటింది. భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించిన జనవరి 25ను ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉంది. ఓటర్లుగా తమకున్న హక్కులు, బాధ్యతల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఓటర్లను చైతన్య చేసేందుకు ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యత తెలిసే విధంగా ఆటలు, పాటల రూపంలో ప్రజలకు తెలియజేస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించేందుకు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
చైతన్యం తీసుకొచ్చేలా..
ఓటు హక్కుపై విద్యార్థి దశలోనే చైతన్యం తేవాలన్న లక్ష్యంతో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలో రెవెన్యూ, విద్యాశాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఉపన్యాసం తదితర పోటీలు నిర్వహిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి పునాది
ఓటు హక్కును పొందడం ప్రతి పౌరుని బాధ్యత. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది వంటింది. ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం.
– పార్థసారథి, తహసీల్దార్, ఫరూఖ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment