అశ్రునయనాలతో.. | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో..

Published Fri, Oct 18 2024 8:48 PM | Last Updated on Fri, Oct 18 2024 8:48 PM

అశ్రునయనాలతో..

ఉసిరికపల్లి మృతుల అంత్యక్రియలు

మూడు తండాల్లో విషాదఛాయలు

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు

శివ్వంపేట(నర్సాపూర్‌)/తూప్రాన్‌: ఉసిరికపల్లి ఘటనలో మృతిచెందిన ఏడుగురి అంత్యక్రియలు గురువారం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మృతులు ధనావత్‌ దుర్గమ్మ, శివరాం దంపతుల అంత్యక్రియలు తాళ్లపల్లి తండాలో, వీరి పెద్ద కూతురు శాంతి, మనుమరాలు మమతవి భీమ్లాతండాలో, మరో కూతురు అనిత, మనుమరాళ్లు శ్రావణి, హిందు అంత్యక్రియలు జెగ్యా తండాలో నిర్వహించారు. ఒకే కుటుంబానికి చెందినా.. వివిధ ప్రాంతాల్లో అంత్యక్రియలు నిర్వహించడంతో బంధువులు అందరి అంతిమయాత్రలో పాల్గొనలేకపోయారు. ఎలాంటి గొడవలు జరగకుండా ఆయా తండాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రెవర్‌ నామ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని జెగ్యా తండాలో అనిత కుటుంబ సభ్యులు, తండావాసులు ఆందోళన చేపట్టారు. ఈక్రమంలో నామ్‌సింగ్‌ కుమారుడు రాజేశ్‌ కనిపించడంతో దాడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. భార్య, ఇద్దరు బిడ్డలను ఆ దేవుడు తీసుకెళ్లిండు.. ఇప్పుడు నాకు దిక్కెవరు అంటూ అనిత భర్త మోహన్‌ కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రమాదంలో మృతిచెందిన మమత (10వ తరగతి), హిందు (8వ తరగతి) గూడూర్‌లోని కేజీబీవీలో చదువుతున్నారు. వీరి మృతి పట్ల హాస్టల్‌ విద్యార్థినులు, అధ్యాపకులు గురువారం శ్రద్ధాంజలి ఘటించారు. ఇద్దరూ చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచేవారని తెలిపారు. దసరా సెలవుల్లో ఇంటికి వెళ్లిన స్నేహితులు కానరాని లోకాలకు వెళ్లిపోవడంపై కన్నీటి పర్యంతం అయ్యారు.

తూప్రాన్‌ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

మృతదేహాలకు తూప్రాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్డం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వాహనాల్లో గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. మృతురాలు అనిత భర్త మోహన్‌ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతికి కారకుడైన కారు డ్రైవర్‌ నామ్‌సింగ్‌ వచ్చే వరకు మృతదేహాలను తరలించవద్దని వాహనాలకు అడ్డుపడ్డారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement