జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్/టౌన్ : వాతావరణ శాఖ వర్ష సూచన నేపథ్యంలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకువచ్చిన ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని కుప్పలుగా మార్చి వాటిని కవర్లతో కప్పి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో గురువారం కలెక్టర్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాల నమోదును, ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా, పంట నష్టానికి గురికాకుండా ఉండేందుకు వీలైనన్ని టార్పాలిన్ కవర్లు వినియోగించాలని సూచించారు. వర్షం పడే సమయంలో రైతులు ధాన్యం రాశుల వద్ద ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
ధాన్యం సేకరణ కేంద్రాల పరిశీలన
రైతుల నుంచి ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకుని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయాలు చేయవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే రికార్డులను పరిశీలించారు. సర్వే ఫామ్‌లను తప్పుల్లేకుండా నమోదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాస్, ఎంపీడీఓ సురేందర్ రెడ్డి, ఏఈఓలు, సంబంధిత సిబ్బందిపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment