రూ. కోట్లు వెచ్చించి విల్లాలు కొన్నా తప్పని ఇక్కట్లు ● గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసుల నిత్య గోస
రామచంద్రాపురం(పటాన్‌చెరు): అన్నీ ఉన్నా అల్లుడి నోట్లు శని అన్న చందంగా ఉంది గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసుల పరిస్థితి. కోట్ల రూపాయ లు వెచ్చించి విల్లాలు కొన్నామన్న సంతృప్తి కన్నా.. గుక్కెడు తాగు నీరందడం లేదన్న వెలితి నిత్యం వెంటాడుతోంది. తమ విల్లాలకు సకల వసతులున్నా.. కనీస అవసరమైనా తాగునీటి సౌకర్యం కరువైంది. దీంతో వారు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీ వాసులు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విల్లాలు కొనుగోలు చేసిన వీరికి మాత్రం తాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉస్మాన్‌నగర్‌లో భూమిని కేటాయించింది. 40 లక్షల లీటర్ల సామర్థ్యంగల సంపు, 20 లక్షల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం, 22 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం కోసం సుమారు రూ.30 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు 2022 నవంబరు 10న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాన చేశా రు. కానీ రెండేళ్లు గడిచినా ట్యాంకు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీ కాలసీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 60 గేటెడ్ కమ్యూనిటీ కాలనీలున్నాయి. ఈ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీలో ఉన్న బోరు నీటినే వారు వినియోగించుకుంటున్నారు, కాగా, సంపు పనులను పూర్తిచేసి కొద్ధి రోజుల క్రితం ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా 20 లక్షల సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడానికి మూడు నెలలు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చితే గానీ గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసుల నీటి గోస తప్పేటట్లు లేదు.
Comments
Please login to add a commentAdd a comment