మానసిక వ్యాధితో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో ఘటన
సిద్దిపేటఅర్బన్: మానసిక వ్యాధితో బాధపడుతున్న విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల డీన్, సిద్దిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌కు చెందిన విద్యార్థిని 11న మిట్టపల్లిలోని మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరింది. విద్యార్థిని ఏడేళ్లుగా ఓసీడీ అనే మానసిక వ్యాధితో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్నా తగ్గలేదు. ఈ క్రమంలో కళాశాలలో చేరిన యువతి తీవ్ర ఒత్తిడికిలోనై 17న హాస్టల్ భవనం మొదటి అంతస్తులో నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని విద్యార్థిని ముందు రోజే సూసైడ్ నోట్ రాసిపెట్టింది. అందులో ‘సారీ నాన్న, అమ్మ, చెల్లి.. చదువుకునే సమయంలో మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. మందులతో నయం కావడం లేదని, ఏడేళ్లుగా ఓసీడీతో బాధ పడుతున్నానని, తనకు సహకరించిన, కఠిన సమయాల్లో ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని ఉంది. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ మధు, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కళాశాలకు చేరుకొని విచారణ జరిపారు. విద్యార్థిని తల్లిదండ్రుల అభ్యర్థనకు మేరకు కళాశాల యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తమ విచారణలో తెలిసిందని ఏసీపీ తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామన్నారు. ఘటనపై కుటుంబీకులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో సుమోటోగా తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment