పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: కలెక్టరేట్ కార్యాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం కలియదిరిగి పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సముదాయంలోని వివిధ శాఖల అధికారులతో పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కలెక్టరేట్‌లోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద పరిశుభ్రత ఆయా శాఖల అధికారులదే బాధ్యతన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం అమలు చేయాలని స్పష్టం చేశారు. వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సకాలంలో పూర్తి చేయాలి
సమగ్ర సర్వేపై అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
రాయికోడ్(అందోల్): ఈ నెల 23 వరకు సకాలంలో సమగ్ర కుటుంబ కుల గణన సర్వే ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండలంలోని కోడూర్ గ్రామంలో సర్వే సక్రమంగా సాగడంలేదని ఎన్యుమరేటర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదు మేరకు ఆ గ్రామంలో చేప ట్టిన సర్వేను ఆయన బుధవారం పరిశీలించారు. సర్వే ఫామ్‌లో ఎన్యుమరేటర్లు నమో దు చేసిన అంశాలను పరిశీలించారు. మండలంలో 80% సర్వే పూర్తయినట్లు మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్ అడిషనల్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మండలంలోని అల్లాపూర్ శివారులో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు.
రంగోత్సవ్ ఆర్ట్స్ పోటీల్లో
మెరిసిన గురుకుల విద్యార్థులు
జహీరాబాద్ టౌన్: ముంబైకు చెందిన రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయి లో నిర్వహించిన పలు ఆర్ట్స్ పోటీలో దిగ్వాల్‌లోని న్యాల్‌కల్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు పలు పతకాలు సాధించారు. గ్రీటింగ్ కార్డ్ తయారీ, టాటూ, హ్యాండ్ రైటింగ్, కార్టూన్ , స్కెచింగ్, ఫోటోగ్రఫీ అంశాలలో పోటీలు నిర్వహించగా గురుకులానికి చెందిన 53 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు గెలుచుకున్నారు. మొత్తంగా 20 స్వర్ణ, 15 కాంస్య, 10 రజత పతకాలతో పాటు నలుగురు కాన్సోలేషన్ బహుమతులు కూడా గెలుచుకున్నారని గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.రాములు బుధవారం మీడియాకు తెలిపారు.
‘ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించండి’
నారాయణఖేడ్: రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాల ర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయా లని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు సీహెచ్ అశోక్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని దొడ్డి కొమురయ్య విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో బుధవా రం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యా ర్థులు డబ్బులు చెల్లించకపోవడంతో టీసీలు పొందక చదువును మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
‘కార్మికులకు భద్రత కరువు’
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పరిశ్రమలలో కార్మికులకు సరైన భద్రత లేకపోవడంతో నిత్యం వారు ప్రమాదాలకు గురవుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బోయిని ప్రసాద్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...పరిశ్రమలలో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. సదాశివపేట ప్రాంతంలోని బ్లూ క్రాఫ్ట్, ఆక్సిజెంట్, ఫార్మా పరిశ్రమలు కార్మికులకు సరైన భద్రత కల్పించకపోవడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment