కంది సాగులో సస్యరక్షణ చర్యలు
టేక్మాల్(మెదక్): కందిపంటసాగులో సస్య రక్షణ చర్యలను పాటిస్తే పంట దిగుబడులను అధికంగా పొందవచ్చును. తగిన మోతాదులో ఆశించిన తెగులు నివారించేందుకు మందులను పిచికారీ చేయాలని వ్యవసాయాధికారులను సంప్రదించి మెలకువలను పాటించాలని టేక్మాల్ వ్యవసాయాధికారి రామ్ ప్రసాద్ (7036110220) తెలిపారు.
ఆకుచుట్టు పురుగు :
కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు నశిస్తుంది. ఆకులను పూతను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని నివారణకు 1.6 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మిల్లీ లీటర్ల క్వినాల్‌ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కాయ తొలుచు పురుగు :
ఈ పురుగు పూత, పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్య రక్షణ తప్పక పాటించాలి.
సమగ్ర సస్యరక్షణ :
● వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు శోశస్థ దశలు ఏరుకు తినటానికి వీలవుతుంది.
● ఈ పురుగు తక్కువగా ఆశించే పంటలైనా జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుములు, ఉలవ, మెట్ట వరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి.
● ఖరీఫ్‌లో అంతర పంటగా 7 సాళ్లు, రబీలో 3 సార్లు పెసర, మినుము వేయడం ద్వారా పరాన్న జీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సాళ్లు జొన్న రక్షిత పైరుగా విత్తాలి.
● పచ్చ పురుగును తట్టుకునే ఐసీపీఎల్ –332, యల్‌ఆర్జీ 41 రకాలను లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల యల్‌ఆర్‌జీ –38 కంది రకాలను సాగు చేయాలి.
● పైరు విత్తిన 90–100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి.
● ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
● పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
● పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5 శాతం వేప గింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి.
మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి
టేక్మాల్ వ్యవసాయాధికారి రామ్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment