మార్కెటింగ్ అవకాశం కల్పించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి జోన్: మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు తగినన్ని అవకాశాలను కల్పించాలని అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. మహిళా సాధికారతను పెంపొందించడంలో భాగంగా గ్రామీణాభివృద్ధి సంస్థ రంగారెడ్డి జిల్లా కన్హ శాంతి వనం ఆదిశక్తి మహోత్సవ ధ్యాన కేంద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మక కేంద్రాలను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా తరఫున మూడు స్టాళ్లను (గుమ్మడిదల, అమీనాపూర్, కోహిర్) పెట్టారు. ఈ స్టాళ్లలో ఆర్గానిక్ ఫుడ్స్, హస్తకళ ఉత్పత్తులు, సహజ సామగ్రి వంటి అనేక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ స్టాళ్లను కలెక్టర్ క్రాంతి ఆదివారం సందర్శించి ఆయా ఉత్పత్తులను పరిశీలించారు. డ్వాక్రా మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిని పెంచుకోవడానికి స్వయం సహాయక సంఘాలకు వేదిక లభించిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సరస్వతీ పూజలో
ఎమ్మెల్యే గూడెం
పటాన్‌చెరు: వసంత పంచమిని పురస్కరించుకుని బెంగాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరు పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పాతికేళ్లుగా స్థానిక బెంగాలీలు వసంత పంచమి రోజు సరస్వతీదేవి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇష్టపడి చదివితే
విజయం మీ వెంటే
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
పటాన్‌చెరు: ప్రతీ విద్యార్థి ఇష్టపడి చదివితే విజయం మీ వెంటే వస్తుందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విద్యార్థులకు హితబోధ చేశారు. పటేల్‌గూడలో ఆదివారం ఐఐటీ చుక్కా రామయ్య ఇష్టా జూనియర్ కళాశాల ఫేర్‌వెల్ డే వేడుకలకు ఐఐటీ ప్రొఫెసర్ హిమబిందుతో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ...తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల్ని చదివిస్తున్నారని వారు కూడా అంతే బాధ్యతగా చదువుకుని ఉన్నతస్థానాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో ఐఐటీ చుక్కారామయ్య ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట, డైరెక్టర్ వినోద్ కుమార్, అకడమిక్ డీన్ ప్రేమ్‌కుమార్, ప్రిన్సిపాల్ దీప, సంగారెడ్డి బ్రాంచ్ ప్రిన్సిపాల్ రవికిరణ్‌రెడ్డి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై ఆరా
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీలో ఆదివారం ప్రత్యేక అధికారి ఫాల్గుణ్ కుమార్ పర్యటించారు. నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అంతర్గత మురికి కాలువలు, రోడ్లు వంటి నిర్మాణ పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌వో నర్సింలు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment