మోక్షం!
సంగమేశ్వర, బసవేశ్వరలకు
● మౌఖికంగా ఆదేశాలిచ్చిన ప్రభుత్వం
● భూ సేకరణలో వేగం పెంచనున్న అధికారులు!
జహీరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు నిలిచిపోయిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మోక్షం కలగనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే ఈ రెండు ఎత్తిపోతల పథకాల పనులను మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయా న్ని అధికారయంత్రాంగం సైతం ధ్రువీకరిస్తోంది. త్వరలోనే భూ సేకరణ పనులను చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ముందు గా వివాదం లేని భూములను సేకరించనున్నారు.
రూ.4,500కోట్ల అంచనా వ్యయం
నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌లో కొన్నింటికి మార్పులు చేసి పథకానికి రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. 21 ఫిబ్రవరి 2022లో నారాయణఖేడ్‌లో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆయా పథకాలకుగాను రూ.4,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20టీఎంసీల వినియోగంతో 3.84లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రెండు ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది.
ఖేడ్ నియోజకవర్గంలో సాగునీటికి బసవేశ్వర..
నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగు నీటిని అందించేందుకుగాను బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద 8 టీఎంసీల నీటితో 1,65లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.1,774కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 14 జూన్ 2021లో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి కంకోల్‌లో సంప్‌హౌజ్, 21 జూన్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన సంప్‌హౌజ్ నిర్మాణానికి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా పథకాలకు గ్రహణం పట్టింది.
కేసీఆర్ హెచ్చరికలతో చలనం..
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలనే యోచనతో ఉండటంతోనే భూ సేకరణ కోసం నీటిపారుదల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల విషయంలో శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో జహీరాబాద్ ప్రాంత నేతల సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. అవసరమైతే ఉద్యమాన్ని చేపట్టి ఆయా ప్రాజెక్టులను సాధిస్తానని ప్రభుత్వానికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
2.19లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా..
సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి గాను 6,293 ఎకరాల భూమి అవసరం అవు తుందని, రూ.2,653 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment