తెలంగాణపై కేంద్రం వివక్ష
టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి హకీం
హత్నూర(సంగారెడ్డి): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, తాజా బడ్జెట్లో రాష్ట్రాన్ని మళ్లీ మోసం చేసిందని టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ఆదివారం విలేకరులతో హకీం మాట్లాడుతూ...కేంద్రం లక్షల కోట్లు బడ్జెట్ ప్రకటించినప్పటికీ తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిందన్నారు. విభజన చట్టంలో రావలసిన నిధులనైనా కనీసం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్,హైదరాబాద్ నాగపూర్ కారిడార్, మెగా లెదర్ పార్క్, మెట్రో రైలు రెండో దశకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ప్రత్యేక నిధుల కేటాయిపులో వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండికూడా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్, మొహమ్మద్ రఫీక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment