ప్లాస్టిక్ నిషేధంపై పట్టింపేది?
పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారింది. కవర్లు, వాటితో చేసిన వస్తువుల విక్రయం, వినియోగం అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అందరి జీవితాల్లో ప్లాస్టిక్ భాగమైపోయింది. పాలు, కూరగాయలు, టీ, టిఫిన్, భోజనం.. ఏది తీసుకురావాలన్నా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. నిషేధం విధించినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఫలితం కానరావడంలేదు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలపట్టణాలతో పాటు, 499 గ్రామ పంచాయతీలన్నీ ప్లాస్టిక్ మయమవుతున్నాయి. – సాక్షి, సిద్దిపేట
ప్లాస్టిక్ నియంత్రణ కోసం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కృషి చేయాలి. కానీ తనిఖీలు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో సిద్దిపేట పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాస్‌లను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు నిఘా కొరవడటంతో ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లలోనూ వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం యథేచ్ఛగా వినియోగిస్తున్నారు.
100 మైక్రాన్ల కంటే తక్కువ వాటిపై..
జాతీయ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ వారు 100 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్‌లను నిషేధించారు. వీటివలన పర్యావరణం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. మొదట్లో కొంత కట్టుదిట్టంగా వ్యవహరించినప్పటికీ తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు.
రోజుకు 15 క్వింటాళ్ల వ్యర్థాలు..
సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరిస్తున్నారు. వారంలో మంగళ, శుక్ర వారాల్లో పొడి చెత్తను, సోమ, బుధ, గురు, శని వారాల్లో తడి, హానికరమైన చెత్తను సేకరిస్తున్నారు. ఇలా రోజుకు 15 క్వింటాళ్ల చొప్పున నెలకు సుమారుగా 300 క్వింటాల్‌ల ప్లాస్టిక్ వెలువడుతోంది.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
ప్లాస్టిక్ సంచులను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో టాస్క్‌ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అవి కొనసాగడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్లాస్టిక్‌ను కట్టడి చేయాలని పట్టణ, పల్లెవాసులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
యథేచ్ఛగా వినియోగం
ఎక్కడా కనిపించని కట్టడి
పట్టణాలు, గ్రామాల్లో విచ్చలవిడిగావిక్రయాలు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఒక్క సిద్దిపేటలోనే రోజుకుసుమారు 15 క్వింటాళ్ల వ్యర్థాలు
తనిఖీలు ముమ్మరం చేశాం
ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరం చేశాం. ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానా విధిస్తాం. ఎకోలాస్టిక్‌లను సిద్దిపేటలో ప్రవేశపెడుతున్నాం. త్వరలో స్టోర్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ప్లాస్టిక్ కవర్లను వినియోగించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.
– ఆశ్రిత్ కుమార్, కమిషనర్,సిద్దిపేట పురపాలక సంఘం
Comments
Please login to add a commentAdd a comment