దండం పెడతాం.. మా భూములు లాక్కోవద్దు
హుస్నాబాద్: ‘ఎన్నో ఏళ్లుగా ఆ భూములను నమ్ముకొని బతుకుతున్నాం. మీకు దండం పెడతాం. మా భూములు లాక్కోవద్దు. మా జోలికి రావద్దు..’ అంటూ రైతులు రెవెన్యూ అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామ సభను రైతులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కెనాల్ భూ సేకరణపై ఆర్టీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో వందలాది ఎకరాల భూములు సేకరించి డీ4 కెనాల్ నిర్మిస్తే ఆ కాలువ ప్రస్తుతం నిరుపయోగంగా ఉందన్నారు. ప్రస్తుతం హుస్నాబాద్ పట్టణంలో రైతుల పొలాల నుంచి ఇళ్ల స్థలాలు, కమర్షియల్ ప్లాట్ల నుంచి డీ4 కెనాల్‌కు లింకు కలుపుతూ 13ఎల్ కాలువ సర్వే చేస్తుండటం సరికాదన్నారు. దీంతో సన్న, చిన్నకారు రైతులు నష్టపోతారన్నారు. ప్రస్తుతం ఆ భూములకు నాలా అనుమతి తీసుకొని ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. విలువ పెరిగిన భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు.
మానవీయ కోణంలో ఆలోచించండి..
మానవీయ కోణంలో ఆలోచించాలే కాని బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం చేయవద్దని రైతులు కోరారు. ఇటీవలే ఓ రైతు తన భూమి కాలువలో పొతుందని మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడని గుర్తు చేశారు. గ్రామ సభ పెడుతున్నట్లు కనీసం రైతులకు నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మాది జీవన్మరణ సమస్య అని, 13 ఎల్ కాలువ కోసం రీ డిజైన్ చేసి భూ సేకరణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం రైతులు తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని గ్రామ సభను బహిష్కరించారు. దీంతో అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ రాములు, తహశీల్దార్ రవీందర్ రెడ్డి, రైతులు ఉన్నారు.
మా జోలికి రావద్దు
గ్రామసభను బహిష్కరించిన రైతులు
గౌరవెల్లి కెనాల్ భూసేకరణపై ఫైర్
Comments
Please login to add a commentAdd a comment