భూసేకరణలో ఎవరినీ నొప్పించం
హుస్నాబాద్: ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ఏర్పాటుకు కావాల్సిన భూ సేకరణ విషయంలో రైతులు సహకరించాలని, నిర్బంధాలు, దౌర్జన్యాలు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం నూతన కార్యాలయం భవనం, 1200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతనంగా నిర్మించిన గోదాంను మంగళవారం మంత్రి ప్రారంభించారు. సంఘం వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ లక్ష్మీకాంతారావు సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సంఘం ఆధ్వర్యంలో రైస్‌మిల్లు, విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ సంఘం ద్వారా రూ.504 కోట్లు రుణ మాఫీ జరిగిందని, ఇంకా 204 మందికి రుణ మాఫీ జరగాల్సి ఉందని తెలిపారు.
చౌటపల్లిలో వ్యవసాయాధారిత పరిశ్రమలు
గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కాలువల నిర్మాణాలకు భూ సేకరణ కోసం అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేద్దామన్నారు. కాలువల కోసం రైతులు సహకరించాలన్నారు. కాలువల డిజైన్ చేసింది తాము కాదని, ఇంజనీర్ల సూచనల ద్వారానే కాలువల అలైన్మెంట్ జరుగుతుందన్నారు. పారిశ్రామిక కారిడార్ తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాలుష్యాన్ని వెదజల్లె పరిశ్రమలు కాకుండా వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్ జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు కొండూరి రవీందర్, తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత పాల్గొన్నారు.
నిర్బంధాలు, దౌర్జన్యాలు ఉండవు
పరిశ్రమలకు రైతులు సహకరించాలి
సహకార సంఘాల అభివృద్ధికి కృషి
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment