పీజీ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు
సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేట (స్వయం ప్రతిపత్తి)లో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఎమ్మెస్సీ బాటని, జువాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎం.కామ్, ఎంఏ తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ విభాగాలలోని ిపీజీ కోర్సులలో మిగిలిన సీట్లకు ఈ నెల 22న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ అయోధ్యలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 22న స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో సంప్రదించాలన్నారు.
మధుమేహ వ్యాధి
నియంత్రణ మనచేతుల్లోనే..
సిద్దిపేట ఎడ్యుకేషన్: రోజువారి దినచర్యలతో మధుమేహ వ్యాఽధిని నియంత్రించవచ్చని ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేశం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్), వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో మధుమేహం వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రొఫెసర్ దేశం మాట్లాడుతూ వంశపారంపర్యంగా, ఆహారపు అలవాట్ల ద్వారా మధుమేహ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మధుమేహం బారీన పడుతున్నారన్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులు రిఫైండ్ ఆహార పదార్థాలు, ఉడికించిన దుంపలు తినకూడదని సూచించారు. సరైన మందులు, దినచర్యలో మార్పులు తీసుకురావడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ స్నేహిక, మెడిసిన్ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అలరించిన శతావధానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): అవధానాలతో పద్య, విద్య అభివృద్ధి చెందుతుందని, ప్రముఖ కవి, పండితులు దోర్బల ప్రభాకరశర్మ అన్నారు. సిద్దిపేట హరిహర రెసిడెన్సిలోని శ్రీలలితా చంద్రమౌళీశ్వర ఆలయ వార్షికోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా పండరి రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన శతావధానం అలరించింది. ముఖ్య అతిథిగా హాజరైన పండితులు దోర్బల ప్రభాకరశర్మ మాట్లాడుతూ పద్యం రసనైవేద్యం అన్నారు. పద్య కవిత్వం మధురంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమాపతి రామ శర్మ, ఉజ్జయిని మహాకాళేశ్వరరావు, వరుకోలు లక్ష్మయ్య, భ్రమరాంబిక, బిట్టు బాబు, కట్టా రంజిత్ కుమార్, తాటికొండ శివ కుమార శర్మ , చొప్పదండి సుధాకర్, వైభవి మొదలైన పృచ్చకులు పాల్గొన్నారు.
ఆరుబయట చెత్తవేస్తే
జరిమానా
సిద్దిపేటజోన్: స్వచ్ఛ సిద్దిపేట మనందరి లక్ష్యమని, ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ సూచించారు. మంగళవారం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చెత్తను వేరుచేసి ఇవ్వకుండా అంతా కలిపి ఇవ్వడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆస్పత్రికి రూ.50 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో తడి, పొడి, హానికర చెత్త అని మూడు రకాలుగా విభజన చేసి పారిశుద్ధ్య కార్మికులకు, చెత్త సేకరణ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. ఆరుబయట చెత్తే వేస్తే జరిమానా తప్పదన్నారు. రెండు సార్లు ఆస్పత్రి అధికారులను హెచ్చరించినా మార్పు రాలేదని దీనితో జరిమానా విధించాల్సి వచ్చిందన్నారు. అంతకుముందు మైత్రి వనంలోని పిల్లల పార్క్ పరిశీలించి మరమ్మతులు చేయాలని సూచించారు. మొక్కలకు ప్రతి రోజు నీరు పట్టాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment