ప్రతీ పాఠశాలలో ‘కరివేపాకు’ మొక్కలు
● హైస్కూల్‌లో 10, ప్రైమరీ స్కూల్‌లో 5 మొక్కలు నాటే కార్యక్రమం ● విద్యార్థుల్లో హిమోగ్లోబిన్ పెంపునకు దోహదం ● పలురకాల పోషకాలు సైతం లభ్యం ● కలెక్టర్ మనుచౌదరి వినూత్న కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలలో కరివేపాకు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మొక్కలను ప్రతీ పాఠశాలలో నాటాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి నిర్ణయించారు. ఇప్పటి వరకు కరివేపాకు అందుబాటులో ఉంటే వంట నిర్వాహకులు వేసేవారు.. లేనిపక్షంలో వదిలేసేవారు. ఇక మధ్యాహ్న భోజన కూరల్లో తప్పనిసరి చేశారు.
–సాక్షి, సిద్దిపేట
జిల్లాలోని హై స్కూల్‌లలో 10 మొక్కలు, ప్రైమరీ స్కూల్‌లలో 5 మొక్కల చొప్పున నాటాలని నిర్ణయించారు. ఇందు కోసం నర్సరీల ద్వారా మొక్కలను అందిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ప్రతీ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటనున్నారు. భోజనం చేసే సమయంలో కరివేపాకును బయట పడేయకుండా తినాలని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
పోషకాలు మెండు
కరివేపాకులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, జింక్, పోషకాలతోపాటు విటమిన్–సి, బి, ఇలు అధికంగా ఉంటాయి. దీంతో విద్యార్థుల్లో హిమోగ్లోబిన్ తగ్గకుండా అందరూ ఉండేందుకు దోహదపడనుంది. రోజూ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. అలాగే త్వరలో మునగ మొక్కలు సైతం నాటాలని నిర్ణయించారు.
పాఠశాలకు మొక్కలను అందిస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలలో కరివేపాకు, మునగ మొక్కలు నాటేందుకు అందజేస్తున్నాం. కరివేపాకుతో విద్యార్థులకు అనేక పోషకాలు అందుతాయి. మధ్యాహ్న భోజనం కూరలో కరివేపాకు వేస్తే విద్యార్థులు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు దోహపడుతుంది. మూడు రోజుల్లో అన్ని పాఠశాలల్లో నాటనున్నారు.
మనుచౌదరి, కలెక్టర్, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment