జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి ముప్పు
సిద్దిపేటఅర్బన్: ‘కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లడమే కాకుండా ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’ అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కార్మిక, కర్షక భవనంను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర విధానాల వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, పరిరక్షణకై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. భవిష్యత్తులో డబ్బున్న వాళ్ళే సమాజాన్ని శాసించే అవకాశం ఉందని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. ఎన్నో ఉద్యమాల త్యాగాలతో లేబర్ చట్టాలను సాధిస్తే వాటన్నింటినీ కుదించి చట్టాలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో భవిష్యత్తులో రైతుల పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉందని అన్నారు. దేశంలో అత్యాచారాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయని అన్నారు. సిద్దిపేటలో కార్మిక కర్షక భవన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అన్యాయానికి గురైన వారికి అండగా, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా కార్మిక కర్షక భవన్ నిలవాలని బీవీ రాఘవులు అన్నారు.
పెట్టుబడులంటూ విదేశీ టూర్లు..
తెలుగు రాష్ట్రాల సీఎంలు పెట్టుబడుల కోసమంటూ సింగపూర్, దావోస్ పర్యటనలు చేయడం చూస్తుంటే తీర్థయాత్రల్లా మారాయన్నారు. చీకటి ఒప్పందాల కోసమే విదేశీ పర్యటన చేస్తున్నారని ఈ పర్యటనలతో ఒరిగిందేమీ లేదని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ, సహాయ కార్యదర్శి పద్మశ్రీ, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు కార్మిక, కర్షక భవన్‌అండగా నిలవాలి
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడుబీవీ రాఘవులు
Comments
Please login to add a commentAdd a comment