తెల్లబోయిన బంగారం
● అంతర్జాతీయంగా మార్కెట్లోడిమాండ్ లేకపోవడమే కారణం ● సీసీఐలోనే మద్దతు ధర ● ప్రైవేటు మార్కెట్ కుదేలు
అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ లేక తెల్లబంగారం తెల్లబోయింది. ఎగుమతులు పడిపోయి అమాంతం ధర దిగజారి ప్రైవేటు మార్కెట్ పతనమైంది. సీసీఐలో మాత్రమే మద్దతు ధర దక్కింది. ప్రైవేటులో క్వింటాలు ధరకు రూ.1000 నుంచి 1500 వ్యాపారులు తగ్గిస్తున్నారు.
గజ్వేల్: 2023–24 సీజన్ ముగిసే నాటికి జిల్లాలో సీసీఐ ద్వారా 7.46 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు మరో 2.49లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. మొత్తంగా 9.95లక్షల క్వింటాళ్ల లావాదేవీలు సాగాయి. ఇప్పటివరకు 10 లక్షల క్వింటాళ్లకుపైగా సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొంటే, ప్రైవేటు వ్యాపారులు 1.43 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ప్రైవేటు మార్కెట్ పతనం కావడం వల్ల పొరుగు జిల్లాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడి సీసీఐ కేంద్రాలకు భారీగా తరలిరావడం వల్ల లావాదేవీలు పెద్ద ఎత్తున సాగాయి. మరికొద్ది రోజుల్లో పూర్తిగా లావాదేవీలు ముగియనున్నాయి. సీసీఐ కేంద్రాల్లో పింజి పెద్దగా ఉన్న పత్తికి గరిష్టంగా రూ.7521, కనిష్టంగా ధర రూ.7124 మద్దతు ధరగా చెల్లించడం వల్ల పత్తి ఉత్పత్తులు పోటెత్తాయి. ప్రైవేటులో క్వింటాలుకు రూ.6వేల–6500 మించి పలకలేదు. దీంతో ప్రైవేటు మార్కెట్ గతంలో పోలిస్తే మరింతగా పతనమైంది.
రెండేళ్ల క్రితం ఇలా
2022–23 ఏడాదిలో పత్తి క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.6080–6380లు ఉండగా, ప్రైవేటు మార్కెట్‌లో సీజన్ ఆరంభంలో రూ.10వేల వరకు పలికింది. సీజన్ మొత్తంలో ఈ ధర రూ.7700కు తగ్గలేదు. ఫలితంగా రైతులు సీసీఐ కేంద్రాలపై ఆధారపడకుండా తమ ఉత్పత్తులను ప్రైవేటులో అమ్ముకొని లాభాలు గడించారు. ఈ ఏడాది ప్రైవేటు వ్యాపారులు 5.50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తే సీసీఐ కనీసం బోణికొట్టలేదు. నేడు భిన్నమైన పరిస్థితి. ప్రైవేటు మార్కెట్‌లో సీసీఐతో పోలిస్తే రూ.1000–1500తక్కువగా ధర పలుకుతోంది.
ఎందుకు ఈ పరిస్థితి?
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పడిపోయింది. దీంతో పత్తి గింజల క్వింటాలు ధర గతంలో రూ.3700 పలికితే ధర నేడు రూ.3400 పలుకుతోంది. క్యాండీ(356 కిలోలు) ధర గతంలో రూ.70వేల వరకు పలికితే నేడు రూ.53వేలు.కాగా, ఎగుమతులు పడిపోయి అమాంతంగా ధర పడిపోయి ప్రైవేటు మార్కెట్ పతనమైంది.
ప్రతికూలతే కారణం
పత్తి ప్రైవేటు మార్కెట్ పతనానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూలతలే కారణంగా నిలుస్తున్నాయి. పత్తి మద్దతు ధర సీసీఐ కేంద్రాల ద్వారా రైతులకు అందేలా చూస్తున్నాం. కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇక చివరి దశకు చేరుకున్నాయి.
– నాగరాజు,
జిల్లా మార్కెటింగ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment