పట్నంవారం ఆదాయంరూ. 61.81 లక్షలు
– గతేడాదితో పోలిస్తే
తగ్గిన ఆదాయం రూ 8.41 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పట్నం వారానికి (మొ దటి ఆదివారం) మూడు రోజుల బుకింగ్ ఆదాయం రూ. 61,81,228లు చేకూరింది. శనివారం రూ.13,88,645, ఆదివారం రూ. 35,03,613, సోమవారం రూ.12,88,970లు కలిపి మొత్తం రూ 61,91,228 వరకు ఆదాయం సమకూరింది. స్వామివారికి భక్తులు వివిధ రకాల మొక్కులు, దర్శనాలు, లడ్డూ ప్రసాదం, పట్నాలు, బోనాలు, టికెట్ల అమ్మకాల ద్వారా ఈ ఆదాయం సమాకూరినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. గత సంవత్సరం పట్నం వారానికి రూ 70,22,980లు సమకూరాయి. ఈ ఏడాది రూ. 8,41,752 లు తక్కువగా బుకింగ్ ఆదాయం వచ్చిందని ఆలయ బుకింగ్ ఇన్‌చార్జి నవీన్ తెలిపారు.
ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలి
– గవర్నర్‌కు చిన్నముత్యంపేట
కులస్తుల వినతి
దుబ్బాక: పేదరికంలో జీవిస్తున్న నక్కల కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని సామాజిక సమరసత వేదిక కేంద్ర సమితి సభ్యులు అప్పాల ప్రసాద్‌జీ, మాజీ ఎమ్మెల్సీ సి.రాంచందర్‌రావు కోరారు. మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తొగుట మండలం చిన్నముత్యంపేట నక్కల కులస్థులతో కలిసి వారు విన్నవించారు. గెజిట్ 32 ప్రకారం నక్కల కులం ఎస్టీ కిందికి వస్తున్నా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో వందలాది మంది పిల్లలు చదువులు మధ్యలోనే ఆపాల్సి వస్తుందని గవర్నర్‌తో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్లు ఈ సర్టిఫికెట్లు ఇవ్వమని, బీసీ సర్టిఫికెట్లు తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా అందాల్సిన పథకాలు వర్తింపజేయాలని విన్నవించారు. కార్యక్రమంలో మెతుకు రాజేందర్, సంచార జాతుల రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, కాల్వ యాదగిరి, తుమ్మల రాజు, చిన్న అంబయ్య తదితరులు ఉన్నారు.
ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా
నరసింహారెడ్డి
హుస్నాబాద్: ట్రస్మా జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. మంగళవారం పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో జరుగగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా నాగిడి నరసింహారెడ్డి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సత్తు మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా శ్రీధర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు నారాయణరెడ్డి, ఆదిరెడ్డి, సుభాశ్, బుర్ర రాజేందర్ తదితరులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జ్యోత్స్న దేవి మంగళవారం తెలిపారు. అలాగే 6వ, 7వ, 8వ తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నామని చెప్పారు. ఐదో తరగతిలో మైనార్టీ విద్యార్థులకు 60 సీట్లు, ఇతరులకు 20 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ ఒక్కో గ్రూపులో మైనార్టీలకు 30 సీట్లు, ఇతరులకు 10 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 79950–57923, 81426–57688 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.
అమరుల స్ఫూర్తితో
ఉద్యమాలు: సుధా భాస్కర్
సంగారెడ్డి ఎడ్యుకేషన్/పటాన్‌చెరు టౌన్: తెలంగాణ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సుధా భాస్కర్ పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో వీరనారి ఐలమ్మ విగ్రహం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment