ఆర్టీసీకి సంక్రాంతి ధమాకా
10 రోజుల్లో రూ.13.73 కోట్ల ఆదాయం
కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు
సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. సాధారణ సర్వీసుల తరహాలోనే మహిళలు సైతం ఈ సర్వీసుల్లోనూ ఉచితంగా ప్రయాణించారు. కాగా, మెజార్టీ డిపోల్లో కార్మికుల సంఖ్య తక్కువ ఉంది. కానీ ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సర్వీసులు రద్దు కాకుండా కార్మికులు డబుల్ డ్యూటీలు నిర్వహించారు. ఇలా చేసిన డ్రైవర్లకు రూ.1,000, కండక్టర్లకు రూ.650 చొప్పున వెంటనే చెల్లించింది. సర్వీసులకు సరాసరి ఆదాయం కంటే ఎక్కువ తెచ్చిన సర్వీసుల డ్రైవర్లు, కండక్టర్లకు సైతం ప్రోత్సాహకాలను అందజేశారు. పండుగ సమీపించిన రెండు రోజులు, తిరుగు ప్రయాణం సందర్భంగా మరో రెండు రోజులు రద్దీ విపరీతంగా ఉండటంతో కార్మికుల భోజనం వెళ్లే సమయం లేకపోవడంతో ఆర్టీసీ అధికారులే భోజనాలు వండించి పార్శిళ్లను అందజేశారు.
నారాయణఖేడ్: సంక్రాంతి పండుగ సీజన్‌ను ఆర్టీసీ ఫుల్‌గా క్యాష్ చేసుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎనిమిది ఆర్టీసీ డిపోల నుంచి పది రోజులు సాధారణ సర్వీసులతోపాటు ప్రత్యేక సర్వీసులు నడిపి రూ.13.73 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఈనెల 9 నుంచి 13 వరకు, సంక్రాంతి పండుగ తర్వాత 16 నుంచి 20వ తేదీవరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్నా.. వెనుకడుగు వేయకుండా సర్వీసులను నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 374 సర్వీసులను నడిపింది. ఇందులో పండుగకు ముందు 201 సర్వీసులు నడపగా, పండుగ ముగిశాక తిరుగు ప్రయాణంగా ఉండే ప్రయాణికుల కోసం 173 సర్వీసులను నడిపింది. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సర్వీసులను అందుబాటులో ఉంచారు.
దసరాకు 14.72కోట్లు..
సంక్రాంతికి 13.73కోట్లు
ఆర్టీసీ రెండు నెలల్లో వచ్చిన ప్రధాన పండుగలతో మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంది. సంక్రాంతికి 10రోజులపాటు సర్వీసులు నడిపి రూ.13.73 కోట్ల ఆదాయం రాబట్టగా దసరాకు 12 రోజులపాటు ప్రత్యేక సర్వీసులు తిప్పి రూ.14.72కోట్ల ఆదాయం సమకూర్చుకుంది.
రద్దీకి అనుగుణంగా సర్వీసుల నిర్వహణ
అన్ని బస్సులూ కిటకిట
సమష్టి కృషి ఫలితమే: ఆర్‌ఎం
కార్మికుల సహకారంతోనే
ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సర్వీసులు నడిపిన ప్రతీసారి కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులందరూ సహకరిస్తున్నారు. సమష్టి కృషి ఫలితంగానే ప్రత్యేక సర్వీసులు నడపటం సాధ్యపడుతుంది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తూ సంస్థకు సహకరించాలి.
– ప్రభులత, రీజినల్ మేనేజర్ (ఆర్‌ఎం) సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment