BGT 2023 IND VS AUS 3rd Test: ప్రస్తుత క్రికెట్ జనరేషన్‌లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ఫాబ్ ఫోర్ బ్యాటర్లుగా కీర్తించబడుతున్న విషయం తెలిసిందే. ఈ నలుగురిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిది అన్ని విషయాల్లో పైచేయి అన్న విషయంతో (కొద్ది రోజుల ముందు వరకు) దాదాపు అందరూ ఏకీభవించేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది.
కోహ్లిని ఏ విషయంలో గొప్ప అని చెప్పుకోవాలో టీమిండియా ఫ్యాన్స్‌కు అర్ధం కావట్లేదు. టెక్నిక్, పరుగులు, సెంచరీలు, రికార్డులు ఇలా చెప్పుకుంటు పోతే దాదాపు అన్ని విషయాల్లో సహచరులతో పోలిస్తే కోహ్లి వెనకపడి ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రూట్, స్మిత్, విలియమ్సన్‌తో పోలిస్తే కాస్త పర్వాలేదనిపించినా.. టెస్ట్‌ల్లో మాత్రం కోహ్లి ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం.
2021 ఆరంభంలో కోహ్లి ఫ్యాబ్ ఫోర్ ఆటగాళ్లలో అందరికంటే అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉండేవాడు. నాటికి కోహ్లి 27 సెంచరీలు చేసి ఉంటే, స్మిత్ 26, విలియమ్సన్ 24, రూట్ 17 సెంచరీలు మాత్రమే చేశారు. అదే 2023 ఫిబ్రవరి వచ్చే సరికి కోహ్లి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అదే 27 సెంచరీల మార్కు వద్ద మిగిలిపోగా.. స్మిత్ 30, రూట్ 29, విలియమ్సన్ 26 సెంచరీల మార్కును అందుకున్నారు.
వీరిలో రూట్ గత రెండేళ్ల కాలంలో ఏకంగా 12 సెంచరీలు బాదగా.. స్మిత్ మధ్యమధ్యలో మూడంకెల ఫిగర్ అందుకున్నాడు. వీరితో పోలిస్తే విలియమ్సన్, కోహ్లి పరిస్థితి దారుణంగా ఉంది. విలియమ్సన్ లేటుగా అయిన రెండేళ్ల తర్వాత.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ చేయగా.. 2021 జనవరిలో చివరి టెస్ట్ సెంచరీ చేసిన కోహ్లి దాదాపు మూడేళ్లైపోయినా ఇప్పటివరకు శతక్కొట్టలేదు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సెంచరీలు చేసిన కోహ్లి టెస్ట్‌ల్లో మాత్రం ఈ మార్కును అందుకోలేకపోతున్నాడు. ఇదే కొనసాగితే.. విలియమ్సన్ కోహ్లిని దాటిపోయి టెస్ట్‌ల్లో కేవలం 9 సెంచరీలు మాత్రమే కలిగిన బాబర్ ఆజమ్ కూడా కోహ్లిని అధిగమించే ప్రమాదం ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. సెంచరీల విషయంలో ఫాబ్ ఫోర్ ఆటగాళ్లలో కోహ్లి 74 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. రూట్ 45, స్మిత్ 42, విలియమ్సన్ 39 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో కోహ్లి మూడేళ్ల సెంచరీ దాహానికి తెరదించి, ఆసీస్‌తో జరిగే మూడో టెస్ట్‌లో శతక్కొట్టాలని ఆశిద్దాం
Comments
Please login to add a commentAdd a comment