
Ashes 4th Test: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టెయిలెండర్లు స్టువర్ట్ బ్రాడ్(35 బంతుల్లో 8 నాటౌట్)-ఆండర్సన్(6 బంతుల్లో 0 నాటౌట్)లు అద్భుతమైన పోరాట పటిమను కనబర్చడంతో ఆతిధ్య ఆసీస్ డ్రాతో సరిపెట్టుకుంది. 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మ్యాచ్ మరో పది ఓవర్లలో ముగుస్తుందన్న సమయానికి 270 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది.
బ్రాడ్ తో కలిసి ఏడు ఓవర్ల పాటు పోరాడి మరో మూడు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న తరుణంలో జాక్ లీచ్(26) ఔటవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో బ్రాడ్, అండర్సన్‌లు తమ అనుభవాన్నంతా రంగరించి ఆసీస్ విజయానికి అడ్డుగా నిలిచారు. స్మిత్ వేసిన ఆఖరి ఓవర్ ఆడిన అండర్సన్.. ఆసీస్‌కు వికెట్ దక్కనివ్వలేదు. ఫలితంగా మ్యాచ్ డ్రా అయ్యింది.
కాగా, సరిగ్గా ఏడాది కిందట ఇదే మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్-హనుమ విహారి సైతం ఇదే తరహాలో పోరాడి ఆసీస్‌కు విజయాన్ని దక్కనీయకుండా అడ్డుపడ్డారు. 2021 జనవరిలో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్), విహారి (161 బంతుల్లో 23 నాటౌట్)లు భీకరమైన ఆసీస్ పేసర్లను ఎదుర్కొని ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచారు. బంతులు విసిరివిసిరి ఆసీస్ బౌలర్లు అలసిపోయారే కానీ ఈ ఇద్దరు క్రీజ్‌ను వీడలేదు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..?