![Chahal Breaks Silence Amid divorce rumours with Dhanashree Verma](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/10/Chahal-Breaks-Silence.jpg.webp?itok=qICtagef)
టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma)తో చహల్‌కు విభేదాలు తలెత్తాయని.. త్వరలోనే ఈ జంట విడిపోనుందనేది(Divorce Rumours) వాటి సారాంశం. అందుకు చహల్ సోషల్ మీడియా పోస్టులు ఊతమిచ్చాయి.
పెళ్లి ఫొటోలు డిలీట్
సతీమణి ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ యజువేంద్ర చహల్(Yuzvendra Chahal) డిలీట్ చేశాడు. పెళ్లి ఫొటోలను కూడా తన అకౌంట్ల నుంచి తీసేశాడు. అంతేకాదు.. ఈ దంపతులు సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. అయితే, ధనశ్రీ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం చహల్‌తో దిగిన ఫొటోలు అలాగే ఉన్నాయి.
కాగా ధనశ్రీ చహల్‌ను మోసం చేస్తోందంటూ అప్పట్లో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరుతో ఆమె పేరును ముడిపెట్టి దారుణమైన కామెంట్లు, మీమ్స్ చేశారు కొంతమంది నెటిజన్లు. మరోవైపు.. చహల్ ఇటీవల ఓ పెళ్లికి మరో అమ్మాయితో కలిసి హాజరైనట్లు ఫొటోలు బయటకు వచ్చాయి.
ఆర్జేతో డేటింగ్?
అంతేకాదు.. మహ్‌వశ్ అనే రేడియో జాకీతో కలిసి చహల్ క్రిస్‌మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. వీటికి మహ్‌వశ్ ఫ్యామిలీ అనే ట్యాగ్ జతచేయడంతో చహల్‌తో ఆమె డేటింగ్ చేస్తుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో చహల్ కూడా ధనశ్రీకి ద్రోహం చేశాడని.. దొందూ దొందేనంటూ ఈ జంటపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఈ పరిణామాలపై యజువేంద్ర చహల్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ‘‘మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈస్థాయికి చేరుకోగలిగాను. అందుకు నా అభిమానులందరికీ ఎల్లకాలం రుణపడి ఉంటాను. అయితే, ఇప్పటికి ఈ ప్రయాణం ఈ ముగిసిందా?.. లేదు.. నేను వేయాల్సిన ఓవర్లు ఇంకా మిగిలే ఉన్నాయి. నా దేశం కోసం.. నా జట్టు కోసం.. నా అభిమానుల కోసం నేను ఆడుతూనే ఉంటాను.
నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!
దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాడిగా ఉండటం నాకెంతో గర్వకారణం. అదే విధంగా.. నేను ఓ కొడుకుని, ఒకరికి సోదరుడిని.. అలాగే చాలా మందికి స్నేహితుడిని. ఈ మధ్యకాలంలో నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై చాలా మందికి ఆసక్తి కలిగించడం సహజమే. అయితే, కొన్ని సోషల్ మీడియా పోస్టుల వల్ల పుడుతున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చు కూడా!
అందరూ బాగుండాలి
ఓ కొడుకుగా.. సోదరుడిగా, స్నేహితుడిగా.. మీ అందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వదంతులు నా కుటుంబ దుఃఖానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ఎదుటివారికి అంతా మంచే జరగాలని కోరుకునేలా నా కుటుంబం నాకు విలువలు నేర్పించింది. అదే విధంగా.. అడ్డదారుల్లో వెళ్లకుండా.. అంకిత భావం, కఠిన శ్రమతోనే విజయాన్ని అందుకోవాలని చెప్పింది. నేను ఇప్పటికీ ఆ విలువలకే కట్టుబడి ఉన్నాను.
ఆ దేవుడి దయ వల్ల మీ అందరి ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి. కానీ మీ సానుభూతిని భరించలేను. లవ్ యూ ఆల్’’ అని చహల్ ఇన్‌స్టా స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు. అయితే, ఇందులో ఎక్కడా ధనశ్రీ పేరుగానీ, భర్త అనే పదం కానీ అతడు వాడలేదు. కాబట్టి విడాకుల విషయాన్ని చెప్పకనే చెప్పాడంటూ మరోసారి గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.
డాన్స్ టీచర్‌తో ప్రేమలో పడి
కాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కొరియోగ్రాఫర్, యూట్యూబర్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ నేర్చుకునే క్రమంలో ఆమెతో ప్రేమల్లో పడ్డ చహల్.. ఇరు కుటుంబాల సమ్మతంతో 2020, డిసెంబరు 20న ఆమెను వివాహం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. టీమిండియా తరఫున 2016లో అరంగేట్రం చేసిన చహల్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్పిన్నర్‌గా సత్తా చాటాడు. ఇప్పటి వరకు 72 వన్డేల్లో 121, 80 అంతర్జాతీయ టీ20లలో 96 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ 205 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది అతడు పంజాబ్ కింగ్స్‌కు ఆడనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment