CWC 2023 AFG VS BAN: ఇదేం గ్రౌండ్‌ రా సామీ.. ఇసుక దిబ్బలే నయం..! | CWC 2023 AFG VS BAN: Netizens Fires On BCCI For Poor Ground Conditions In Dharamshala | Sakshi
Sakshi News home page

CWC 2023 AFG VS BAN: ఇదేం గ్రౌండ్‌ రా సామీ.. ధర్మశాల మైదానంపై నెటిజన్ల ఆగ్రహం

Published Sun, Oct 8 2023 10:27 AM | Last Updated on Sun, Oct 8 2023 10:27 AM

CWC 2023 AFG VS BAN: Netizens Fires On BCCI For Poor Ground Conditions In Dharamshala - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నిన్న (అక్టోబర్‌ 7) ఆఫ్ఘనిస్తాన్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 34.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెహది హసన్‌ మీరజ్‌ ఆల్‌రౌండర్‌ షోతో (9-3-25-3, 57) అదరగొట్టి బంగ్లాదేశ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 

కాగా, మ్యాచ్‌ అనంతరం ధర్మశాల మైదానంపై సోషల్‌మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌండరీ లైన్‌ వద్ద గ్రౌండ్‌ పరిస్థితిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రౌండ్‌ కంటే ఇసుక, బుడద దిబ్బలు నయమని అంటున్నారు. గ్రౌండ్‌ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియోను (బౌండరీ లైన్‌ వద్ద ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడ్డ వీడియోను) వైరల్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే గ్రౌండ్‌ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.

వరల్డ్‌కప్‌ లాంటి మెగా ఈవెంట్‌లో మ్యాచ్‌ నిర్వహించేందుకు ఈ గ్రౌండ్‌కు ఐసీసీ ఎలా అనుమతి ఇచ్చిందని క్రికెట్‌ ఫాలోవర్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రమాణాలు లేని బుడద మైదానంలో మ్యాచ్‌ను నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఈ విషయంలో జనాలు బీసీసీఐని నిందిస్తున్నారు. కాగా, ధర్మశాల మైదానం హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉందన్న విషయం తెలిసిందే. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ శీతలంగా ఉంటుంది. ఇక్కడ ఎండ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ మైదానం కాస్త స్టికీగా ఉంటుంది. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌.. ఇవాళ (అక్టోబర్‌ 8) తమ తొలి మ్యాచ్‌ను ఆడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇవాళ భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభంకానుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తైన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అద్భుత విజయం సాధించగా.. రెండో మ్యాచ్లో నెదార్లండ్స్‌పై పాక్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. నిన్న జరిగిన 2 మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్‌.. శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయాలు నమోదు చేశాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement