వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్‌ | He has got something different: Rohit Sharma on Varun Chakaravarthy | Sakshi
Sakshi News home page

వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్‌

Published Mon, Mar 3 2025 8:30 AM | Last Updated on Mon, Mar 3 2025 9:30 AM

He has got something different: Rohit Sharma on Varun Chakaravarthy

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో గ్రూపు స్టేజిని భార‌త్ ఆజేయంగా ముగించింది. దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో 44 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (98 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హార్దిక్‌  పాండ్యా (45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (61 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

30 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన భార‌త జ‌ట్టును అయ్య‌ర్‌, అక్ష‌ర్ త‌మ అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో అదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరిద్ద‌రూ 98 పరుగులు జోడించారు. కివీస్‌ బౌలర్లలో మాట్‌ హెన్రీ (5/42) ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో కివీస్ 205 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి 5 వికెట్ల‌తో కివీస్ ప‌తనాన్ని శాసించాడు.

అత‌డితో పాటు కుల్దీప్ యాద‌వ్ రెండు, హార్దిక్‌, జ‌డేజా, అక్ష‌ర్ త‌లా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో కేన్ విలియ‌మ్స‌న్(81) టాప్ స్కోరర్ నిలిచాడు. కాగా భారత్ త‌మ తొలి సెమీఫైన‌ల్లో మంగ‌ళ‌వారం(మార్చి 4) ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. సెమీస్‌కు ముందు ఇటువంటి విజయం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని రోహిత్ తెలిపాడు.

"ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిని విజ‌యంతో ముగించాల‌ని భావించాము. మేము అనుకున్న‌ది జ‌రిగినందుకు చాలా అనందంగా ఉంది. న్యూజిలాండ్ జ‌ట్టు ఇటీవ‌ల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. అటువంటి జ‌ట్టును ఓడించాలంటే మ‌న ప్ర‌ణాళిక‌లను స‌రిగ్గా అమ‌లు చేయాలి. ప‌వ‌ర్ ప్లేలో 30 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డాము.

ఆ స‌మ‌యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అక్ష‌ర్ ప‌టేల్ అద్బుత‌మైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆఖ‌రిలో హార్దిక్ పాండ్యా కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. మా ద‌గ్గ‌ర క్వాలిటీ బౌల‌ర్లు ఉండ‌డంతో డిఫెండ్ చేసుకునే టోట‌ల్ ల‌భించంద‌ని భావించాము. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. నిజంగా వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి ఒక మిస్ట‌రీ స్పిన్న‌రే.

అత‌డిని ఎవ‌రితోనూ పోల్చ‌లేం. తొలి రెండు మ్యాచ్‌ల‌కే బెంచ్‌కే ప‌రిమిత‌మైన అత‌డికి ఓ ఛాన్స్ ఇద్దామ‌ని ఈ మ్యాచ్‌లో ఆడించాము. అత‌డు బంతితో అద్భుతం చేశాడు. త‌దుప‌రి మ్యాచ్ కోసం మేము ప్ర‌స్తుతం ఆలోచించ‌డం లేదు. కానీ అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ కాంబినేషన్ కొంచెం తలనొప్పిగా మారింది. ఈ టోర్నమెంట్‌లో ప్ర‌తీ మ్యాచ్‌ను గెల‌వాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నాము. ఇటువంటి మెగా ఈవెంట్‌ల‌లో త‌ప్పులు జ‌ర‌గ‌డం స‌హ‌జం.

కానీ త‌ప్పిదాల‌ను సరిదిద్దుకుని ముందుకు వెళ్ల‌డం చాలా ముఖ్యం. ఆసీస్‌తో సెమీస్ మంచి గేమ్ కానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కోసం నేను అతృతగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: Champions Trophy: భారత్‌తో సెమీఫైన‌ల్‌.. ఆసీస్ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర ఆట‌గాడు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement