ఒక్కసారి ఆ పరుగుల ప్రవాహం మొదలైందంటే అతడిని ఆపడం ఎవరి వల్లా కాదని మరోసారి రుజువైంది. పరుగులు, రికార్డులను చూసీ చూసీ క్రికెట్ ప్రపంచం అలసిపోతోంది కానీ అతను మాత్రం కాదు. మంచినీళ్ల ప్రాయంలా అనడం కూడా చిన్న మాటనే! శ్రీలంకతో మూడో వన్డేలో తనకే సాధ్యమైన అద్భుతమైన షాట్లు అలవోకగా కొడుతూ విరాట్ కోహ్లి కెరీర్‌లో 46వ శతకంతో చెలరేగాడు.
100 సెంచరీల సెంచరీ దిశగా మరో అడుగు ముందుకేశాడు. తొలి వన్డేతో పోలిస్తే ఈ సారైతే చెమట చుక్క చిందించకుండా భారీ స్కోరుతో చెలరేగిపోయాడు. మరోవైపు సెంచరీతోనే యువ శుబ్‌మన్ గిల్ తన సత్తా ప్రదర్శించాడు. ఫలితంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ ఖాతాలో అతి పెద్ద విజయం చేరింది.
కోహ్లి జోరు, టీమిండియా హోరులో.. పేలవ ఆటతో శ్రీలంక జట్టు చిత్తయి సిరీస్‌ను 0–3తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరువనంతపురం మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటంటే..
46- కోహ్లి సెంచరీల సంఖ్య. అత్యధిక వన్డే శతకాల జాబితాలో సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు)కు కోహ్లి దగ్గరయ్యాడు. భారత్‌లో అత్యధిక సెంచరీలు చేసిన (21) బ్యాటర్‌గా సచిన్ (20)ను దాటిన కోహ్లి... ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు (10; శ్రీలంకపై) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
5- వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి ఐదో స్థానానికి (12,754) చేరుకున్నాడు.
317- పరుగుల పరంగా వన్డేల్లో అతి పెద్ద విజయాన్ని భారత్ (317 పరుగులు) నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ జట్టు పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలిచింది.
96- శ్రీలంకపై భారత్ విజయాల సంఖ్య. వన్డే క్రికెట్‌లో ఒక జట్టుపై ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా (95 – న్యూజిలాండ్‌పై) పేరిట ఉన్న రికార్డును భారత్ తిరగరాసింది.
3- స్వదేశంలో శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇది మూడోసారి. గతంలో భారత్ 1982లో 3–0తో... 2014లో 5–0తో వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది.
ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో వన్డే విశేషాలు
ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌ను భారత్ భారీ విజయంతో ముగించిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. కాగా లంకతో ఆదివారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా 317 పరుగుల గెలిచిన సంగతి తెలిసిందే. పరుగుల పరంగా వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. అనంతరం లంక 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. నువనిదు (19)దే అత్యధిక స్కోరు. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ (4/32) ప్రత్యర్థిని దెబ్బకొట్టగా... కుల్దీప్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. తాజా ఫలితంతో సిరీస్ 3–0తో భారత్ సొంతమైంది.
గిల్ బౌండరీల జోరు...
తొలి మూడు ఓవర్లలో వచ్చింది 5 పరుగులే... ఇది చూస్తే పిచ్ స్వభావంపై సందేహాలు వచ్చాయి. అయితే అసలు ఆట ఆ తర్వాత మొదలైంది. కుమార ఓవర్లో రోహిత్ శర్మ (49 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్స్‌తో మొదలు పెట్టగా... గిల్ వరుసగా 4 ఫోర్లు బాది తానేంటో చూపించాడు. ఆ తర్వాత రజిత ఓవర్లోనూ వరుసగా 6, 6, 4 కొట్టి దూకుడు పెంచిన రోహిత్ అదే జోరులో ఆడబోయి బౌండరీ వద్ద చిక్కాడు.
అనంతరం 52 బంతుల్లో గిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ దూసుకుపోయింది. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ ఒకరితో మరొకరు పోటీ పడి చకచకా పరుగులు సాధించారు. నువనిదు ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి 90ల్లోకి చేరుకున్న గిల్... అతని తర్వాతి ఓవర్లో లాంగాన్ దిశగా సింగిల్ తీసి కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాతా తగ్గకుండా వాండర్సె ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, రజిత బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి క్లీన్‌బౌల్డ్ కావడంతో చక్కటి ఇన్నింగ్స్ ముగిసింది.
విరాట్ విశ్వరూపం...
48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి... గిల్ అవుటయ్యే సమయానికి 58 పరుగుల వద్ద ఉన్నాడు. మరోవైపు నుంచి శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కోహ్లికి తగిన సహకారం అందించాడు. 40వ ఓవర్ ముగిసేసరికి కోహ్లి స్కోరు 82 పరుగులు కాగా... 9 ఫోర్లే కొట్టాడు. ఆ తర్వాత అతని విధ్వంసం మొదలైంది. ముందుగా కరుణరత్నే ఓవర్లో లాంగాన్ దిశగా సింగిల్ తీసి అతను సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఆ తర్వాత రజిత ఓవర్లో సిక్స్ కొట్టిన కోహ్లి... కరుణరత్నే తర్వాతి ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాదాడు. రజిత మరో ఓవర్లోనూ కోహ్లి 2 సిక్స్‌లు, ఫోర్ రాబట్టాడు. కుమార వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లోనూ ఇదే తరహాలో 2 సిక్స్‌లు, ఫోర్ బాది విరాట్ అజేయంగా నిలిచాడు. ఆఖరి 10 ఓవర్లలో భారత్ 116 పరుగులు చేయగా... కోహ్లి ఒక్కడే 34 బంతులు మాత్రమే ఆడి 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు సాధించడం విశేషం!
టపటపా...
కొండంత లక్ష్యం చూడగానే ఆటకు ముందే చేతులెత్తేసిన లంక కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. సిరాజ్ పదునైన బౌలింగ్ ముందు తలవంచిన జట్టు బ్యాటర్లు వరుసగా వికెట్లు అప్పగించేశారు. తొలి 5 వికెట్లలో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్... తన బౌలింగ్‌లో షాట్ కోసం ముందుకొచ్చి సరైన సమయంలో క్రీజ్‌లోకి వెళ్లలేకపోయిన కరుణరత్నేను రనౌట్ చేసి ఆరో వికెట్ పతనంలోనూ కీలకపాత్ర పోషించాడు.
అతి కష్టమ్మీద నువనిదు, రజిత (13 నాటౌట్), షనక (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. సిరాజ్ స్పెల్ చివర్లో అతను తొలి ఐదు వికెట్ల ఘనత అందుకునేందుకు సహచరులంతా ప్రయత్నించారు. ఇతర బౌలర్లు బ్యాటర్‌కు దూరంగా బంతులు వేస్తూ వికెట్ తీయకుండా జాగ్రత్తపడ్డారు. అయితే అదృష్టం కలిసి రాక సిరాజ్ 4 వికెట్లకే పరిమితమయ్యాడు.
ఆటగాళ్ల ‘ఢీ’
మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 43వ ఓవర్ ఐదో బంతిని కోహ్లి పుల్ షాట్ ఆడగా బంతి బౌండరీ వైపు దూసుకుపోయింది. జెఫ్రీ వాండెర్సె బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి ఎడమ వైపునకు, ఆషెన్ బండారా డీప్ మిడ్ వికెట్ నుంచి కుడి వైపునకు బంతిని ఆపేందుకు దూసుకొచ్చారు.
ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన వీరిద్దరు ఒకరినొకరు ఢీ కొట్టారు. బాధగా ఇద్దరూ కొద్దిసేపు విలవిల్లాడగా, స్ట్రెచర్‌పై బయటకు తీసుకుపోవాల్సి వచ్చింది. వాండెర్సె స్థానంలో వెలలాగే ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’గా ఆడగా, బండార బ్యాటింగ్‌కు దిగలేకపోయాడు. ఈ బౌండరీతో 99కు చేరిన కోహ్లి తర్వాతి బంతికే సెంచరీ పూర్తి చేసుకున్నా... ఎలాంటి సంబరాలు ప్రదర్శించలేదు.
చదవండి: IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment