షమీ, కోహ్లి సంబరం
వర్షం సమస్య లేకపోతే రోజంతా అందుబాటులో ఉన్న మొత్తం ఓవర్లు 98... మరో 18 వికెట్లు పడితే గానీ విజేత ఎవరో తేలదు... ప్రస్తుతం భారత్ ఆధిక్యం 32 పరుగులు మాత్రమే. ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఎంత లక్ష్యం నిర్దేశిస్తే కివీస్‌కు సవాల్ విసరవచ్చో... దూకుడుగా ఆడి పరుగులు సాధించాలో, కుప్పకూలిపోకుండా వికెట్లు కాపాడుకోవాలో అర్థం కాని సంకట స్థితిలో టీమిండియా నిలిచింది. అదే న్యూజిలాండ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో చివరి రోజున వికెట్ల వేటకు సిద్ధంగా ఉంది. లక్ష్యం కష్టసాధ్యంగా మారితే మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం కూడా ఆ జట్టుకు ఉంది. ఈ నేపథ్యంలో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చివరి రోజు ఆట ఎలా సాగుతుందనేది ఆసక్తికరం.
సౌతాంప్టన్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఊహించినట్లుగానే ఆరో రోజుకు చేరింది. ‘రిజర్వ్ డే’ కారణంగా మ్యాచ్‌లో ఇంకా జీవం మిగిలి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం కోల్పోయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు ముందంజలో నిలిచి మ్యాచ్ ఐదో రోజును ముగించింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. గిల్ (8) రోహిత్ (30; 2 ఫోర్లు) అవుట్ కాగా... పుజారా (12), కోహ్లి (8) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నా రు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు.
పేసర్ల జోరు
తొలి సెషన్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ విలియమ్సన్, రాస్ టేలర్ (11) అతి జాగ్రత్తగా ఆడారు. మొదటి గంటలో 13 ఓవర్లలో ఆ జట్టు 16 పరుగులు మాత్రమే చేసింది. అయితే పేసర్లు చెలరేగి లంచ్‌లోపు మూడు వికెట్లు తీయడంతో భారత్ పైచేయి సాధించింది. షమీ బౌలింగ్‌లో గిల్ అద్భుత క్యాచ్‌కు టేలర్ వెనుదిరగ్గా, ఇషాంత్ బౌలింగ్‌లో నికోల్స్ (7) స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. వాట్లింగ్ (1)ను మరో చక్కటి బంతితో షమీ బౌల్డ్ చేశాడు. రెండో సెషన్‌లో గ్రాండ్‌హోమ్ (13) కూడా షమీ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోగా... మరో ఎండ్‌లో విలియమ్సన్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 32 పరుగుల వద్ద అతనికి కొంత అదృష్టం కూడా కలిసొచ్చింది. షమీ బౌలింగ్‌లో ఎల్బీ కోసం అప్పీల్ చేసిన భారత్ రివ్యూ కోరింది. అయితే వెంట్రుకవాసి తేడాతో ‘అంపైర్ కాల్’ ద్వారా అతను బయటపడ్డాడు. షమీ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో దూకుడుగా ఆడబోయిన జేమీసన్ (21) అదే ఓవర్లో వెనుదిరగ్గా... కివీస్‌కు ఆధిక్యం లభించగానే ఇషాంత్ బౌలింగ్‌లో పేలవ షాట్‌కు విలియమ్సన్ వెనుదిరిగాడు. అయితే చివర్లో సౌతీ (46 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటం తో కివీస్ మెరుగ్గా ఇన్నింగ్స్‌ను ముగించగలిగింది. చివరి 4 వికెట్లకు ఆ జట్టు 77 రన్స్ జోడించింది.
రాణించిన సౌతీ
రెండో ఇన్నింగ్స్‌లో కూడా కివీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్, గిల్ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిచ్చారు. అయితే తొలి ఇన్నింగ్స్ లోటును పూరించక ముందే గిల్‌ను సౌతీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రోహిత్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడి కుదురుకుంటున్న దశలో స్వయంకృతంతో వెనుదిరిగాడు. సౌతీ బంతి సరిగా అంచనా వేయలేక బ్యాట్ ఎత్తేసిన అతను ఎల్బీగా వెనుదిరిగాడు. అతను రివ్యూ కోరే ప్రయత్నం కూడా చేయలేదు. అనంతరం మరో 19 బంతులు ఎదుర్కొన్న కోహ్లి, పుజారా ప్రమాదం లేకుండా జాగ్రత్తపడ్డారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 217; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 30; కాన్వే (సి) షమీ (బి) ఇషాంత్ 54; విలియమ్సన్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 49; టేలర్ (సి) గిల్ (బి) షమీ 11; నికోల్స్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 7; వాట్లింగ్ (బి) షమీ 1; గ్రాండ్‌హోమ్ (ఎల్బీ) (బి) షమీ 13; జేమీసన్ (సి) బుమ్రా (బి) షమీ 21; సౌతీ (బి) జడేజా 30; వాగ్నర్ (సి) రహానే (బి) అశ్విన్ 0; బౌల్ట్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (99.2 ఓవర్లలో ఆలౌట్) 249
వికెట్ల పతనం: 1–70, 2–101, 3–117, 4–134, 5–135, 6–162, 7–192, 8–221, 9–234, 10–249.
బౌలింగ్: ఇషాంత్ 25–9–48–3, బుమ్రా 26–9–57–0, షమీ 26–8–76–4, అశ్విన్ 15–5–28–2, జడేజా 7.2–2–20–1.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) సౌతీ 30; గిల్ (ఎల్బీ) (బి) సౌతీ 8; పుజారా (బ్యాటింగ్) 12; కోహ్లి (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (30 ఓవర్లలో 2 వికెట్లకు) 64
వికెట్ల పతనం: 1–24, 2–51.
బౌలింగ్: సౌతీ 9–3–17–2 , బౌల్ట్ 8–1–20–0, జేమీసన్ 10–4–15–0, వాగ్నర్ 3–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment