![PC: IPL/RCB](/styles/webp/s3/article_images/2024/05/12/123.webp?itok=hEPeWmOK)
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి గెలుపు జెండా ఎగురవేసింది. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు సాధించింది. అయితే, మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు.
యశ్ దయాల్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఫెర్గూసన్ రెండు, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో ఢిల్లీని 140 పరుగులకే ఆలౌట్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.
ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు
👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు
👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్
👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)
👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)
👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు
రాణించిన విల్ జాక్స్, పాటిదార్.. ఆర్సీబీ స్కోరు ఎంతంటే!
ఐపీఎల్- 2024 ప్లే ఆఫ్స్ రేసులో భాగంగా మరో రసవత్తర సమరం జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది.
సొంతమైదానంలో టాస్ ఓడిన ఆర్సీబీ.. ఢిల్లీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి(13 బంతుల్లో 27) ధాటిగా ఆరంభించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ డుప్లెసిస్(6) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.
ఈ క్రమంలో విల్ జాక్స్(29 బంతుల్లో 41), రజత్ పాటిదార్ (32 బంతుల్లో 52) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. వీరికి తోడు ఐదో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 పరుగులు నాటౌట్) కూడా రాణించాడు.
అయితే, లోయర్ ఆర్డర్ మహిపాల్ లామ్రోర్(13) ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. దినేశ్ కార్తిక్, స్వప్నిల్ సింగ్ డకౌట్ అయ్యారు. కరణ్ శర్మ ఆరు పరుగులు చేసి రనౌట్ కాగా.. మహ్మద్ సిరాజ్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 187 పరుగులు స్కోరు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలాం రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment