క్రైస్ట్‌చర్చ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్, 176 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే కివీస్ తొలిసారిగా అరుదైన ఘనత సాధించింది. పాక్ జట్టుపై విజయంతో 118 పాయింట్లు సాధించి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 జట్టుగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా వంటి మేటి జట్లను వెనక్కినెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం న్యూజిలాండ్(118) మొదటి స్థానంలో ఉండగా, ఆసీస్(116), టీమిండియా(114) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
కివీస్ బౌలర్ కైల్ జేమీసన్ ఐదు వికెట్లు తీసి పాకిస్తాన్ జట్టును ఏ దశలోనూ కోలుకోకుండా దెబ్బకొట్టాడు. దీంతో పర్యాటక జట్టు 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయం మూటగట్టుకుంది. అజహర్ అలీ(37), జాఫర్ గౌహర్(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో జెమీసన్ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకే పాక్ పోరాటం ముగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 286/3తో మంగళవారం ఆటను కొనసాగించిన విలియమ్సన్ సేన తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.(చదవండి: విలియమ్సన్ డబుల్ సెంచరీ)
ఇక తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విలియమ్సన్ తన కెరీర్‌లో నాలుగో డబుల్ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించడమే గాకుండా.. టెస్టుల్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ మీద 176 పరుగుల తేడాతో జట్టు గెలుపొందడం ద్వారా అగ్రస్థానానికి చేరుకోవడంతో ఈ సిరీస్ అతడికి మరింత ప్రత్యేకంగా మారింది. కాగా తాజా విజయంతో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 420 పాయింట్లతో ప్రస్తుతం మూడోస్థానంలో నిలిచింది.
The moment @BLACKCAPS became No.1 🙌#NZvPAK | #WTC21 pic.twitter.com/i1kpzTRhxq
— ICC (@ICC) January 6, 2021
Comments
Please login to add a commentAdd a comment