ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్నస్ లబుషేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలర్లలో ఓ స్టార్ పేసర్‌తో తనకు అనుబంధం ఉందని.. అయితే, అదే సమయంలో ప్రత్యర్థిగా అతడితో పోటీ తనకు పూనకాలు తెప్పిస్తుందని తెలిపాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఈ ఏడాది నవంబరులో ఇరు జట్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి.
టీమిండియాదే పైచేయి
ఇందులో భాగంగా ఆసీస్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లనుంది. ఇక ఈ టోర్నీలో గత నాలుగు దఫాలుగా భారత జట్టునే విజయం వరిస్తోంది. రెండేళ్లకొకసారి జరిగే ఈ ఈవెంట్లో చివరగా రెండుసార్లు ఆసీస్‌లో, రెండుసార్లు సొంతగడ్డపై టీమిండియానే గెలిచింది.
ఇప్పటి నుంచే హైప్
ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని భారత్ ఓవరాల్‌గా పదిసార్లు గెలవగా.. ఆస్ట్రేలియా ఐదుసార్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ప్రణాళికల గురించి వెల్లడిస్తున్నారు. ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్.. టీమిండియాతో పోటీ గురించి చెబుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్‌లతో తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు.
మరోవైపు.. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కామెరాన్‌గ్రీన్ తదితరులు టీమిండియా భవిష్యత్తు సూపర్‌స్టార్ల గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు రానున్న కాలంలో టీమిండియాకు కీలకం కానున్నారని.. వారిని కట్టడి చేసేందుకు తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
సిరాజ్‌తో పోటీ అంటే ఇష్టం
తాజాగా ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఆడటం తనకు ఇష్టమని పేర్కొన్నాడు. సిరాజ్ కెరీర్ తొలినాళ్ల నుంచి అతడిని చూస్తున్నానని.. ఈ హైదరాబాదీ సరైన దిశలో తన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రశంసించాడు.
అక్కడే అరంగేట్రం
ఏదేమైనా టీమిండియా బౌలర్లలో సిరాజ్‌తో పోటీ అంటేనే తనకు మజా వస్తుందని లబుషేన్ తెలిపాడు. కాగా 2020 నాటి బోర్డర్- గావస్కర్ సందర్భంగానే సిరాజ్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటి వరకు 27 టెస్టులు, 44 వన్డేలు, 16 టీ20లు ఆడిన సిరాజ్ ఖాతాలో వరుసగా 74, 71, 14 వికెట్లు ఉన్నాయి. మరోవైపు.. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లబుషేన్ 50 టెస్టుల్లో 4114 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. 52 వన్డేలు ఆడి 1656 రన్స్ సాధించడంతో పాటు 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: ఇంగ్లండ్ కూడా అలాగే అనుకుంది: బంగ్లాకు రోహిత్ శర్మ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment