
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న తొలి లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీని రాజస్థాన్ కింగ్స్ కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో రాబిన్ ఉతప్ప సారధ్యం వహిస్తున్న రాజస్థాన్.. యువరాజ్ సింగ్ నాయకత్వంలోని న్యూయార్క్ సూపర్‌స్టార్ స్ట్రయికర్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూయార్క్‌ను గెలిపించేందకు యువరాజ్ సింగ్ చివరివరకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. ఆష్లే నర్స్ (41 బంతుల్లో 97), హ్యామిల్టన్ మసకద్జ (30 బంతుల్లో 56) చెలరేగడంతో నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. న్యూయార్క్ బౌలర్లలో జేరోమ్ టేలర్ 3 వికెట్లు పడగొట్టగా.. నువాన్ ప్రదీప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూయార్క్.. యువరాజ్ సింగ్ మెరుపు అర్దశతకంతో (22 బంతుల్లో 54) మెరిసినప్పటికీ ఓటమిపాలైంది. ఈ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూయార్క్ ఇన్నింగ్స్‌లో కపుగెదెర (30), గుణరత్నే (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో పర్విందర్ అవానా, జకాతి, బిపుల్ శర్మ, చతురంగ డిసిల్వ, ఆష్లే నర్స్ తలో వికెట్ పడగొట్టారు.