బంగ్లాదేశ్‌ జట్టుకు రోహిత్‌ శర్మ వార్నింగ్‌ | Rohit Sharma Warns Bangladesh Lene Do Maze Unko Quotes England Example | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ కూడా అలాగే అనుకుంది: బంగ్లాకు రోహిత్‌ శర్మ వార్నింగ్‌

Published Tue, Sep 17 2024 2:43 PM | Last Updated on Tue, Sep 17 2024 3:35 PM

Rohit Sharma Warns Bangladesh Lene Do Maze Unko Quotes England Example

ప్రత్యర్థి ఎవరన్న అంశంతో తమకు పనిలేదని.. గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)లో తమకు ప్రతీ మ్యాచ్‌ ముఖ్యమేనని పేర్కొన్నాడు. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌ ముచ్చటపడుతోంది.. కానీ
ఏదేమైనా.. ఆరు నెలల పాటు టెస్టులకు దూరం ఉండటం కచ్చితంగా ప్రభావం చూపుతుందని.. అయితే, తమ జట్టులోని చాలా మంది క్రికెటర్లు దేశవాళీ టోర్నీలు ఆడటం సానుకూల అంశమని రోహిత్‌ అన్నాడు. బంగ్లాదేశ్‌ తమను ఓడించాలని ముచ్చటపడుతోందని.. అయితే, వారి ఆశ నెరవేరదని పేర్కొన్నాడు. 

ఇంగ్లండ్‌ కూడా ఇలాగే చాలెంజ్‌ చేసి బోల్తా పడిందని రోహిత్‌ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇక చివరగా తాము ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్‌కు చాలా మంది ఆటగాళ్లు గాయాల వల్ల దూరమయ్యారని.. ఇప్పుడు మాత్రం దాదాపుగా అందరూ అందుబాటులో ఉండటం అదనపు బలమని  హర్షం వ్యక్తం చేశాడు.

ప్రతి ఒక్క మ్యాచ్‌ మాకు కీలకమే
కాగా డబ్ల్యూటీసీ సైకిల్‌ 2023-25లో భాగంగా సెప్టెంబరు 19 నుంచి టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. చెన్నై, కాన్పూర్‌ ఇందుకు వేదికలు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికే తొలి టెస్టుకు జట్టును ప్రకటించగా.. చెన్నై చేరుకుని శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంగళవారం మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా.. ‘‘దేశం కోసం ఆడే ప్రతి ఒక్క మ్యాచ్‌ మాకు కీలకమే. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఇదొక రిహార్సల్‌లా మేము భావించడం లేదు. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ పాయింట్లు గెలవాలంటే ప్రత్యర్థి ఎవరైనా తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. మేము దాదాపుగా ఆరు- ఏడు నెలల పాటు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్నాము.

అయితే, జట్టులోని అత్యధిక మంది అనుభవజ్ఞులే. మరికొందరేమో దులిప్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఆడి ఫామ్‌లోకి వచ్చారు. కాబట్టి బంగ్లాదేశ్‌తో టెస్టులకు మేము అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాము. చిన్నపాటి విరామం వల్ల పెద్దగా ప్రభావం ఉండబోదు.

జట్టు ఏదైనా మా లక్ష్యం ఒకటే
ఇక ఏ జట్టైనా సరే టీమిండియాను ఓడించాలనే కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌ కూడా ముచ్చటపడుతోంది. అయితే, మాకు ఇప్పటికే అన్ని జట్లతో ఆడిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా అయినా.. బంగ్లాదేశ్‌ అయినా.. మా వ్యూహాలు అంతే పటిష్టంగా ఉంటాయి. గెలుపే మా అంతిమ లక్ష్యం’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. 

బంగ్లా జట్టుకు రోహిత్‌ కౌంటర్‌
కాగా ఇటీవల.. పాకిస్తాన్‌ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ గెలిచిన జోరుమీదున్న బంగ్లాదేశ్‌.. టీమిండియాపై గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ ఈ మేర కౌంటర్‌ ఇచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ తాజా సైకిల్‌లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్‌ తర్వాత న్యూజిలాండ్‌(3), ఆస్ట్రేలియా(5)తో టెస్టు సిరీస్‌ ఆడనుంది. టీమిండియా చివరగా ఆరు నెలల క్రితం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడి 4-1తో  గెలిచింది.

చదవండి: T20 WC: టీ20 క్రికెట్‌.. పొట్టి ఫార్మాట్‌ కానేకాదు: కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement