ముంబై ఇండియన్స్ (PC: MI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా స్టార్లపైనే ఉన్నాయి.
రేసులో భారత స్టార్లు
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ సహా రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ తదితర సీనియర్ ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ముంబై ఇండియన్స్ భారత స్పిన్నర్లను దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంఛైజీలతో కచ్చితంగా పోటీపడుతుందని అభిప్రాయపడ్డాడు.
పాలసీ పరిపూర్ణంగా ఉపయోగించుకుని
కాగా ఈసారి రిటెన్షన్ విధానాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్న జట్టు ముంబై ఇండియన్స్ అని చెప్పవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ఇక వీళ్లందరికి ఖర్చు పెట్టింది పోనూ.. ముంబై పర్సులో ఇంకా రూ. 45 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ముంబై బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే, వాళ్ల రిటెన్షన్ లిస్టులో బుమ్రా రూపంలో ఒకే ఒక స్పెషలిస్టు బౌలర్ ఉన్నాడు.
కాబట్టి వారికి ఇప్పుడు బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నిజానికి ముంబై 225- 250 పరుగులు స్కోరు చేయగల సామర్థ్యం కలిగిన జట్టు. అయితే, అదే స్థాయిలో పరుగులు కూడా సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి.
బ్యాటింగ్ పైనే ఎక్కువగా
ఏదేమైనా వాళ్లు బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది వాస్తవం. కానీ ప్రతిసారీ ఇదే టెక్నిక్ పనికిరాదు. వాళ్ల జట్టులో ఉంటే ఇండియన్ బ్యాటింగ్ లైనప్.. విదేశీ బౌలింగ్ లైనప్ ఉంటుంది. ఇప్పుడు వారికి ఇద్దరు స్పిన్నర్ల అవసరం కూడా ఉంది. అందుకే కచ్చితంగా వాళ్లు యుజీ చహల్ వెనుకపడటం ఖాయం.
ఇషాన్ కాదు
ఒకవేళ అతడిని దక్కించుకోలేకపోతే.. ముంబై ఇండియన్స్ వాషింగ్టన్ సుందర్‌నైనా సొంతం చేసుకుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించిన ఆకాశ్ చోప్రా.. అతడిని ముంబై కొనుగోలు చేసే అవకాశం లేదని అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్‌ను పరిగణించినా.. క్వింటన్ డికాక్ లేదంటే జితేశ్ శర్మ వైపు మొగ్గు చూపుతుందని అంచనా వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment