టరూబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో): కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నీ తాజా సీజన్‌లో లీగ్ దశను అజేయంగా దాటిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ సెమీఫైనల్లోనూ అదే దూకుడును కనబరిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో నైట్‌రైడర్స్ 9 వికెట్లతో జమైకా తలవాస్‌పై గెలుపొందింది. దాంతో సీపీఎల్ టైటిల్ పోరుకు మూడోసారి అర్హత సాధించింది. బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, జూహీ చావ్లాలకు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు గతంలో 2017, 2018 సీజన్‌లో ఫైనల్ చేరి చాంపియన్‌గా నిలిచింది. నైట్‌రైడర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలుత జమైకా 20 ఓవర్లలో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అకీల్ హుసీన్ (3/14), క్యారీ పియరీ (2/29) ప్రత్యర్థిని కుదురుకునే ప్రయత్నం చేయలేదు. బోనర్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు), రోవ్‌మాన్ పొవెల్ (35 బంతుల్లో 33; 1 ఫోరు, 1 సిక్స్) తలవాస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్ 15 ఓవర్లలో వికెట్ నష్టపోయి 111 చేసి గెలుపొందింది. ఓపెనర్ లెండిల్ సిమ్మన్స్ అజేయ అర్ధ సెంచరీ (44 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో రాణించాడు. అతడికి టియాన్ వెబ్‌స్టర్ (43 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. వీరు అభేద్యమైన రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో నైట్‌రైడర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment